రేవంత్ కాంగ్రెస్ ఒకటి.. రాహుల్ కాంగ్రెస్ మరొకటి
మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు
జహీరాబాద్: రాష్ట్రంలో రెండు కాంగ్రెస్ పార్టీలు నడుస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఒకటి రాహూల్ గాంధీ కాంగ్రెస్ అయితే, మరొకటి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌గా వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, రేవంత్ ఎజెండా వేరు, రాహుల్ ఎజెండా వేరుగా ఉందన్నారు. గుజరాత్ మోడల్‌ను పీఎం మోదీ ఎదుట రేవంత్ పొగిడారని, రాహుల్ మాత్రం గుజరాత్ మోడల్ డొల్ల అని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన రాజకీయ పునాదులు ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్‌కైనా మూడో స్థానమే దిక్కు అని హరీశ్ జోస్యం చెప్పారు. కేరళ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్‌ను రేవంత్ బీజేపీ తొత్తు అని విమర్శించారని, సీపీఎం ఏనాడైనా బీజేపీతో కలుస్తుందా? అని హరీశ్ ప్రశ్నించారు.
అబద్ధాల్లో రేవంత్, భట్టి పోటీ
అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పోటీ పడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈద్‌మిలాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ మాట ఇచ్చారని,, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిందని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క మాత్రం తాము నిరుద్యోగభృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడారని ఆరోపించారు. తాజాగా రైతుల రుణమాఫీపై భట్టి విక్రమార్క నాలుక మడత పెట్టారని విమర్శించారు. ఇది రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమేనని విమర్శించారు.
ఏపీలో బాబు మాదిరే.. ఇక్కడ కూడా
ఆంధ్రలో టీడీపీ, బీజేపీ కలిశాయని, అదే విధానం మేరకు చంద్రబాబు మిత్రుడు ఇక్కడ బీజేపీతో మిలాఖత్ అయ్యారని హరీశ్‌రావు సీఎం రేవంత్‌నుద్దేశించి విమర్శించారు. బీజేపీని వ్యతిరేకిస్తూ వచి్చంది బీఆర్‌ఎస్సేనని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే బీజేపీ బలపడుతోందన్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తోందని హరీశ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment