తూంకుంట, బొంరాస్‌పేట, చందవెల్లి, మాజిల్‌పూర్ గ్రామాల్లో భూకుంభకోణాలు
కుట్రపూరితంగానే ధరణి రూపకల్పన.. భూఅక్రమాలకు కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులు
వెంటనే విచారణ జరిపించండి: ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితాను అడ్డుపెట్టుకుని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. షామీర్‌పేట మండలం తూంకుంట, బొంరాస్‌పేట, చేవెళ్ల మండలం చందవెల్లి, మాజిల్‌పూర్ గ్రామాల్లో జరిగిన భూకుంభకోణాలకు సంబంధించిన సమగ్ర ఆధారాలను సమర్పించానని, వీటిపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గాందీభవన్‌లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. షామీర్‌పేట మండలం తూంకుంట గ్రామంలోని 164/1 సర్వే నెంబర్‌లోని 26 ఎకరాల అటవీ భూమిని జూన్, 2022లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు.
బొంరాస్‌పేట గ్రామంలోని 260/2, 261, 265/8, 361/7, 361/9 సర్వే నెంబర్లలో రక్షణ శాఖకు చెందిన భూమిని బాలాజీ అసోసియేట్ అనే సంస్థకు ఇచ్చారని, అదే గ్రామంలోని 65 ఎకరాల ప్రైవేటు భూమిని రైతులకు కాకుండా అప్పట్లో రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుటుంబానికి చెందిన ఎఫ్‌ఫర్‌ఎల్ ఫార్మ్ అనే సంస్థకు దారాధత్తం చేశారని నిందించారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూములను 2018లో ఎన్నికలు కాగానే అంబుజ్ అగర్వాల్ పేరిట రిజి్రస్టేషన్ చేశారని ఆరోపించారు. 24లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి వారికి అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారని కోదండరెడ్డి విమర్శించారు.
దళితుల భూములను కేటీఆర్ అమ్ముకున్నారు
చేవెళ్ల మండలం చందవెల్లి అనే గ్రామంలో దళితుల నుంచి ఎకరం రూ.9 లక్షల చొప్పున 1,500 ఎకరాలు తీసుకుని తనకు అనుకూలంగా ఉన్న మల్టినేషనల్ కంపెనీకి ఎకరానికి రూ.1.30 కోట్లకు కేటీఆర్ అమ్ముకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. మాజిల్‌పూర్ అనే గ్రామంలో ల్యాండ్‌సీలింగ్‌లో ఉన్న 25 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారని చెప్పారు. వీటన్నింటికీ సంబంధించి సమగ్ర ఆధారాలను ప్రభుత్వానికి ఇచ్చానని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.
భూములను కాజేయాలనే కుట్రపూరిత ఆలోచనలతోనే కేసీఆర్ ధరణికి రూపకల్పన చేశారని, రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణాలు, అక్రమాలకు కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులని ఆరోపించారు. అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తికాగానే చర్యలకు ఉపక్రమించి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు ఇందుకు బాధ్యులైన ఎంతటి వారిపైన అయినా కఠినచర్యలు తీసుకోవాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment