
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన శ్వేతపత్రం అసెంబ్లీలో సెగలు రేపింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2014–15లో ప్రభుత్వ అప్పులు రూ.72,658 కోట్లు అయితే.. ఇప్పుడు రూ.6.71 లక్షల కోట్లకు చేరాయని పేర్కొంటూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అధికార, విపక్ష సభ్యుల నడుమ పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా మార్చిందని అధికారపక్షం విమర్శలు గుప్పిస్తే.. ‘శ్వేతపత్రం’ అంతా తప్పులతడక అని, అప్పులతోపాటు ఆస్తులు పెరిగిన అంశాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నిలదీసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని అధికారపక్షం పేర్కొంటే.. ఈ సాకుతో గ్యారంటీ హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపించింది.
మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించి..
మూడు రోజుల విరామం అనంతరం బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభలో ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్ష నేతగా కూనంనేని సాంబశివరావులను గుర్తిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతి మరణం పట్ల శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది.
తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వ వనరుల వినియోగం సక్రమంగా జరగలేదని, రోజూవారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలను ప్రజలకు తెలియపర్చడం కోసమే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని చెప్పారు.
పరిశీలించేందుకు అరగంట సమయమిచ్చి..
స్వల్పకాలిక చర్చలో భట్టి అనంతరం ప్రసంగించాల్సిందిగా బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే 42 పేజీల నివేదికను ఇచ్చి, అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వకపోవడంపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా కొంత సమయం కావాలని కోరారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సుమారు గంటా 15 నిమిషాల తర్వాత సభ తిరిగి సమావేశమైంది.
గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకే..
ప్రసంగాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణిలో తప్పులతడకగా రూపొందించారని మండిపడ్డారు. శ్వేతపత్రంలో ప్రగతికోణం లేదని, రాజకీయ ప్రత్యర్ధులపై దాడి చేయడంతోపాటు వాస్తవాల వక్రీకరణ కోసం ఉపయోగించుకునేలా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సస్పెండైన అధికారుల సాయంతో కాంగ్రెస్ సర్కారుకు అనుకూలంగా ఉండేలా శ్వేతపత్రం తయారు చేయించారని విరుచుకుపడ్డారు.
అయితే హరీశ్ ప్రసంగిస్తున్న సమయంలో... సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు తదితరులు జోక్యం చేసుకుని గత సర్కారుపై విమర్శలు చేశారు. దీనిపై హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శ్వేతపత్రంలో లోపాలు ఉన్నాయంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు. ఈ తరహా చర్చల ద్వారా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయొద్దని సూచించారు.
మరోవైపు కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ఆర్థిక స్థితిని సాకుగా చూపించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవాలని చూస్తే ఊరుకోబోమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పక్షాన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. భారీగా అప్పులు చేసినా.. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టలేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
అప్పులు, తప్పులే అంటూ సీఎం విమర్శలు
గత ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి ఆదాయం వస్తుందంటూ తప్పుడు నివేదికలతో అప్పులు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు జోక్యం చేసుకుని విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు అత్యధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
చివరిగా శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తర్వాత కూడా సీఎం రేవంత్ మరోసారి జోక్యం చేసుకుని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తొమ్మిది గంటలకుపైగా సుదీర్ఘంగా సాగిన ఈ చర్చను ముగిసినట్లు ప్రకటించిన స్పీకర్.. శాసనసభను గురువారంకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment