‘పరిషత్‌’లో పరాభవం | Huge Defeat For TDP In Andhra Pradesh Parishad Elections | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’లో పరాభవం

Published Mon, Sep 20 2021 5:00 AM | Last Updated on Mon, Sep 20 2021 5:00 AM

Huge Defeat For TDP In Andhra Pradesh Parishad Elections - Sakshi

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్ష టీడీపీ పాతాళానికి కుంగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కంటే దారుణమైన పరాజయాన్ని ఈసారి చంద్రబాబు మూటగట్టుకున్నారు. పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలకు మించి అవమానకర ఓటమి టీడీపీ శ్రేణులకు ఎదురైంది. 13 జిల్లా పరిషత్‌ల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. కనీసం పోటీ ఇవ్వలేక టీడీపీ అభ్యర్థులు చతికిలపడ్డారు. 6,659 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసి అర్థరాత్రి ఫలితాలు వెలువడుతున్న సమయానికి 803 స్థానాలకు పరిమితమైంది. 482 జెడ్పీటీసీలకు పోటీ చేసి కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది. 7 జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల్లో టీడీపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. శ్రీకాకుళం, విజయనగరం,, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ ఒక్క జెడ్పీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. మిగిలిన ఆరు జిల్లాలకు గాను ఐదు జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని, కృష్ణా జిల్లాలో రెండు  జెడ్పీటీసీ స్థానాలను అతికష్టం మీద సాధించింది.

కుప్పంలో కకావికలం
తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మరోసారి కుదేలయ్యారు. అక్కడ వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేయడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీడీపీకి మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది (అర్బన్‌ నియోజకవర్గాలు మినహా) ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను కూడా దక్కించుకోలేకపోయారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ దరిదాపుల్లోకి రాలేక చేతులెత్తేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తు లేకపోవడంతో ప్రజలను గందరగోళ పరిచేందుకు తాము సగం స్థానాల్లో గెలిచినట్లు హడావుడి చేసిన చంద్రబాబు మునిసిపల్‌ ఎన్నికల్లో చేతులెత్తేశారు. 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా ఒకే ఒక్క మునిసిపాల్టీకి టీడీపీ పరిమితమైంది. ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల్లో అంతకు మించిన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ చరిత్రలో ఇది అతి పెద్ద ఓటమిగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

నిమ్మకూరు వైఎస్సార్‌సీపీకే   
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ స్వగ్రామం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఈ గ్రామాన్ని చంద్రబాబు తనయుడు లోకేష్‌ దత్తత తీసుకున్నా అక్కడి ప్రజలు ఆయన్ను పట్టించుకోలేదు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేసినా ప్రజల ఆశీర్వాదం ప్రతిపక్షానికి దక్కలేదు. ఎన్టీఆర్‌ సొంత మండలమైన పామర్రులో మండల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత తొలిసారి టీడీపీ ఓడిపోయింది. పామర్రు మండల పరిషత్‌ను తొలిసారి వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ఇన్నేళ్ల తర్వాత అక్కడ వైఎస్సార్‌సీపీ పాగా వేయడం విశేషం. ఎన్టీఆర్‌ అత్త ఊరు కొమరోలులోనూ టీడీపీకి పరాజయం తప్పలేదు. కొమరోలును చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న విషయం విదితమే. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా సొంత నియోజకవర్గంలో బోల్తా పడ్డారు. ఒక్క జెడ్పీటీసీ, ఎంపీపీని కూడా గెలుచుకోలేకపోయారు. 

అతిథిపై విజయ బావుటా..
విజయనగరం జిల్లాలో సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు కుమార్తె అతిథి పోటీ చేసిన జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. పార్టీ విజయనగరం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఇన్‌చార్జిగా ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ కైవశం చేసుకుంది. 

అడ్రస్‌ లేని అచ్చెన్న
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు సొంత నియోజకవర్గం టెక్కలిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. టెక్కలిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. టెక్కలి జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ వాణి అత్యధికంగా 22,732 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అచ్చెన్న సొంత మండలం కోటబొమ్మాళిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుబ్బ వెంకట రమణరావు 11,894 ఓట్ల ఆధిక్యతతో విజయబావుటా ఎగురవేశారు. నియోజకవర్గంలో 78 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ స్వగ్రామం రామయ్యపుట్టుక (కవిటి–2) ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. అక్కడ నాలుగు జెడ్పీటీసీలు, ఎంపీపీలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 

ప్రకాశం తీర్పు ఫ్యాన్‌కే
ప్రకాశం జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), డోలా బాలవీరాంజనేయస్వామి (కొండెపి) తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్క జెడ్పీటీసీగానీ, మండల పరిషత్‌గానీ గెలిపించుకోలేకపోయారు. వారి సొంత గ్రామాల్లో సైతం ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందడం గమనార్హం.

విపక్షానికి గుంటూరు గుణపాఠం
గుంటూరు జిల్లాలో టీడీపీకి ప్రస్తుతం మిగిలిన ఏకైక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ రేపల్లె నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయారు. 65 ఎంపీటీసీలకు కేవలం నాలుగు చోట్లే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అక్కడ 42 ఎంపీటీసీలకు కేవలం 5 మాత్రమే టీడీపీ గెలిచింది. 

యనమలకు స్వగ్రామంలో పరాభవం
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత గ్రామం అగర్తపాలెంలో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. ఉండి ఎమ్మెల్యే రామరాజు సొంత గ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ, మండల పరిషత్‌ల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవలేకపోయింది. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు సొంత గ్రామం తొండంగి మండలం ఏవీ నగరంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. 

హిందూపురం ‘ఫ్యాన్‌’ పరం
అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఒక్క జెడ్పీటీసీ, మండల పరిషత్‌ను కూడా టీడీపీ సాధించలేకపోయింది. టీడీపీకి పట్టున్న పలు గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, జేసీ దివాకర్‌రెడ్డి వారి సొంత నియోజకవర్గాలైన రాప్తాడు, తాడిపత్రిలో కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement