
ఈటల గెలిస్తే బీజేపీకి, ఒక వ్యక్తికి లాభం అవుతుంది. అదే టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలందరికీ లాభం అవుతుందని మంత్రి హరీశ్ అన్నారు.
సాక్షి, కరీంనగర్: ప్రజల్ని మభ్యపెట్టి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేలా అందంగా మాట్లాడుతున్న బీజేపీ నేతలకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావ్ వ్యాఖ్యానించారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి క్రూడాయిల్ ధరలు పెరగడమే కారణం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుజూరాబాద్‌లో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కిషన్ రెడ్డి గారూ మీరు కేంద్ర మంత్రి అయి ఉండి ఇంత పచ్చిగా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు చెప్తాం కానీ అన్నీ చెయ్యలేం అని అమిత్ షా, గడ్కరీలు చెప్పలేదా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, నాగార్జున సాగర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా బీజేపీనీ చిత్తు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ఈటెల రాజేందర్ కరోనా సమయంలో మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం పీపీఈ కిట్లు మందులు ఇవ్వడం లేదని తెలంగాణాపై వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు మాట తప్పింది, మాట మార్చింది ఈటల కాదా?. బీజేపీ లోకి వెళ్ళాక ఆయనకు కూడా బురద అంటినట్టు ఉంది. ఇప్పుడు అదే రాజేందర్ బీజేపీ గొప్ప పార్టీ అని పొగుడుతున్నారని అన్నారు.
చదవండి: (ఈటలది ముమ్మాటికీ వెన్నుపోటే!)
నిజామాబాద్ రైతులకు పంగ నామాలు పెట్టిన ఎంపీ అరవింద్ హుజూరాబాద్‌కు వచ్చి నీతులు చెప్తారా?. పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన అరవింద్‌తో మేము నీతులు చెప్పించుకోవాలా అన్నారు. బాండ్ పేపర్ అరవింద్ చెప్తే హుజూరాబాద్ ప్రజలు నమ్ముతారా అని వ్యాఖ్యానించారు. ఎందుకోసం బీజేపీకి ఓట్లు వేయాలో చెప్పాలన్న హరీశ్ హుజూరాబాద్ ప్రజలారా బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని సూచించారు. ఇంకా రెండేళ్ల నాలుగు నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని కేసీఆర్ సీఎంగా ఉంటారని అభివృద్ధి చేసుకోవాలనీ అన్నారు. ఈటల గెలిస్తే బీజేపీకి, ఒక వ్యక్తికి లాభం అవుతుంది. అదే టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలందరికీ లాభం అవుతుందని మంత్రి హరీశ్ అన్నారు.