సాక్షి , కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సంగ్రామంలో ప్రథమ ఘట్టం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ రెండు సెట్‌ల నామినేషన్‌లు దాఖలు చేయగా, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్సూరి అలీ నామినేషన్ వేశారు.
మరో స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ నామినేషన్‌ను పలు సాంకేతిక కారణాలతో అధికారులు స్వీకరించలేదు. కాగా.. నామినేషన్‌ల ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తల్లిదండ్రుల దీవెనలు..
టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆశీర్వదించి బీఫారం అందించగా, శ్రీనివాస్ శుక్రవారం ఉదయం కొమురెల్లి మల్లిఖార్జునస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కమలాపూర్ మండలం ఉప్పల్ చేరుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడి నుంచి నేరుగా 12.40 నిమిషాలకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి హుజూరాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే గెల్లు శ్రీనివాస్ తల్లిదండ్రుల మల్లయ్య, లక్ష్మి దీవెనలు తీసుకోగా, భార్య శ్వేత శుభాకాంక్షలు చెప్పారు.
తర్వాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి 12.55 నిమిషాలకు మొదటి సెట్, 01.16 నిమిషాలకు రెండో సెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదటి నామినేషన్‌ను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రతిపాదించగా, రెండో సెట్‌కు జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ ప్రతిపాదించారు.
కోడ్ హుజూరాబాద్‌కే పరిమితం..
హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఆ నియోజకవర్గానికే అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్, వరంగల్ (హనుమకొండ) నగరపాలక సంస్థలకు వర్తించదని ప్రకటనలో స్పష్టంచేశారు.
నామినేషన్ ప్రక్రియ పరిశీలన
నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధి కారి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నా మినేషన్ల స్వీకరణ సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
తుపాకులు వెనక్కివ్వాలని..
కోడ్ వెలువడిన నేపథ్యంలో పోలీసు అధికారులు లైసెన్స్‌డ్ తుపాకులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక మంది తమకు ప్రాణహాని ఉందని వెపన్స్‌ను తమతోపాటే ఉంచుకుంటామని పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. కానీ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరికీ మినహాయింపులు లేవని కరాఖండిగా చెప్పిన పోలీసులు మొత్తానికి దాదాపు 40 మందికిపైగా వ్యక్తుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
సాయంత్రానికి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల కోడ్ పరిధిని హుజూరాబాద్‌కే పరిమితం చేస్తూ ప్రకటన రావడంతో మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలువురు ప్రముఖులు పోలీస్‌స్టేషన్లకు పరుగులు తీశారు.
చెక్ పోస్ట్ తనిఖీ..
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్, హుజూరాబాద్ మధ్యలో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌తో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తనిఖీ చేశారు. శుక్రవారం వరంగల్ నుండి హుజూరాబాద్ వచ్చే ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ఎక్స్‌పెండేచర్ అబ్జర్వర్ జి.ఎలమురుగుతో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ద్వారా వచ్చే ప్రతీ వాహనాన్ని చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయాలని స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేసే అవకాశం ఉందని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment