చంచల్‌గూడ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ రేవంత్‌రెడ్డి. చిత్రంలో సంపత్‌కుమార్, గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్శిటీ/ చంచల్‌గూడ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన వివాదం రోజురోజుకు పెద్దదవుతోంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన సభ విషయమై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు మరో 17 మంది నేతల విషయంలో ఏం చేయాలనే అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా పలువురు నేతలు చంచల్‌గూడ జైల్లో ఉన్న వెంకట్ తదితరులను పరామర్శించారు.
ఓయూలో విద్యార్థుల అరెస్టు
బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తం గా నిరసన తెలియజేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమ వారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వీసీ రవీందర్, సీఎం కేసీఆర్‌లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగాని దయాకర్‌గౌడ్, నవ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు బైరు నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. ఓయూ పాలక మండలి చేసిన నిబంధనలు కేవలం కాంగ్రెస్ పార్టీకేనా? టీఆర్‌ఎస్, బీజేపీలకు వర్తించవా? అని ప్రశ్నించారు. ఓయూలో 7న రాహుల్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్, అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు స్పష్టం చేశారు. కాగా ఓయూలో రాహుల్‌గాంధీ పర్యటనకు ఎలాంటి అనుమతి లేదని వీసీ సోమవారం మరోమారు తేల్చి చెప్పారు. క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు భారీగా మోహరించారు.
రాహుల్ ఓయూ వెళతారు: రేవంత్‌రెడ్డి
సోమవారం ఉదయం సీఎల్పీలో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్‌లు బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై చర్చించారు. తర్వాత పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జీ.వినోద్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఫిరోజ్‌ఖాన్‌లతో కలిసి చంచల్‌గూడ జైలుకు వెళ్లి వెంకట్ తదితరులతో ములాఖత్ అయ్యారు.
ఈనెల 7వ తేదీని ములాఖత్ కోసం రాహుల్ గాంధీ వస్తారని, సమయం ఇవ్వాలని కోరుతూ జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఓయూకు ఖచ్చితంగా వెళ్తారని చెప్పారు. అలాగే విద్యార్థి నేతలతో ములాఖత్ కోసం జైలుకు కూడా వస్తారని తెలిపారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సీటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వర్సిటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో మమేకం కావాలని నిర్ణయిం చుకున్నారని తెలిపారు.
ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారం సేకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని భావిం చినట్లు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ఒత్తిడితోనే ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రాహుల్‌ను ఓయూకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లేందుకు భయపడుతున్న కేసీఆర్ కుట్రపూరి తంగానే రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుం టున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment