సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర చీఫ్ మార్పు విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనితోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థి అంశమూ తెరపైకి వచ్చింది. కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇవ్వడంతోపాటు సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశంపై ఓవైపు.. రాష్ట్రంలో ‘బీసీ సీఎం’ అభ్యర్థిని ప్రకటిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న దానిపై మరోవైపు చర్చ మొదలైంది. దీనిపై సోమవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం కిషన్‌రెడ్డికే మొగ్గు ..: కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికే ఈ బాధ్యతలు అప్పగించేందుకే అధిష్టానం పెద్దలు మొగ్గుచూపుతున్నారని, ఈ దిశగా ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చే నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిషన్‌రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. దీనితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డిని బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
బాధ్యతల నిర్వహణ విషయంలో అధిష్టానం తరఫున పూర్తి మద్దతు అందిస్తామనీ పేర్కొన్నట్టు తెలిసింది. అయినా కిషన్‌రెడ్డి పలు సందేహాలు వ్యక్తం చేస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత చేపట్టే విషయంలో ముందుకు రావడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి సోమవారం జరిగే కీలకమైన కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నాయి. ఒకవేళ కిషన్‌రెడ్డి ముందుకు రాకుంటే.. రాష్ట్ర చీఫ్ బాధ్యతలను ఎవరికి అప్పగించవచ్చు, సీఎం అభ్యరి్థగా ఎవరిని ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందన్న అంశాలను బీజేపీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి.
‘బీసీ సీఎం’తో ప్రయోజనం ఉంటుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనపై బీజేపీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రెండూ అగ్రవర్ణాలకు చెందిన వారినే సీఎంగా ప్రమోట్ చేసే అవకాశం ఉందని, బీజేపీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే.. రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బీసీలు, మరో 35 శాతం దాకా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలను ఆకర్షించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు తెలిసింది.
ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం ఉండగానే సమర్థవంతమైన బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. ప్రజల మద్దతు పొందవచ్చని కొందరు నేతలు కోరుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలను దీటుగా ఎదుర్కొనగలిగే నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నట్టు తెలిసింది. మొత్తంగా సోమవారం నాటికి పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై స్పష్టత వస్తుందని, అప్పటివరకు వేచి ఉండక తప్పదని పార్టీ నాయకులు చెప్తున్నారు. కాగా.. ఈనెల 8న ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం జరగనుంది. దీనికి బండి సంజయ్, జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు!
Comments
Please login to add a commentAdd a comment