టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు: ఈటల రాజేందర్‌ | If BJP Gives Order Iam Ready To Contest Against CM KCR Says Etela Rajender | Sakshi
Sakshi News home page

Etela Rajender: ‘టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు’

Published Thu, Dec 16 2021 3:57 PM | Last Updated on Thu, Dec 16 2021 5:58 PM

If BJP Gives Order Iam Ready To Contest Against CM KCR Says Etela Rajender - Sakshi

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తనకు బండి సంజయ్‌కు మధ్య విభేదాలు లేవని, తనెప్పుడూ గ్రూపులు కట్టలేదని స్పష్టం చేశారు. పార్టీలు మారే సంస్కృతి తనది కాదని ఈటల స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి తాను బయటకు రాలేదని, వాళ్లే పంపించేశారని గుర్తు చేశారు. అన్నీ ఆలోచించుకున్న తరువాతే బీజేపీలో చేరానని వెల్లడించిన ఈటల.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తాననే ప్రచారం సీఎం కేసీఆర్‌ చేయిస్తున్నాడని మండిపడ్డారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేస్తాయనేది ఊహజనితమని ఈటల రాజేందర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదని, ఇక కొట్లాటనే ఉందన్నారు. తెలంగాణలో అధికారం బీజేపీదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ దిగిపోయి కేటీఆర్‌ను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసే అంశం టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గతంగా ఉందని అన్నారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు లేదని నేతలే చెప్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు కాపలదారులే తప్ప వారసులు కాదని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి.. మెదట  సొంత రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దుకోవాలని ఎద్దేవా చేశారు. 
చదవండి: KCR: పాలన పరుగు.. పార్టీకి మెరుగు

‘ఏడున్నరేళ్ళుగా కేసీఆర్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడం వలన రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి.. తర్వాత సమర్థించిన చరిత్ర కేసీఆర్‌ది. కలసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చింది. వ్యక్తిగత అవసరాల కోసం లొంగిపోవద్దు. హుజురాబాద్ ఓట్ల‌ కోసమే కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చాడన్న నా మాటకు కట్టుబడి ఉన్నాను. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే దళితబంధు ఇప్పటికీ ఎందుకు ఇవ్వటం లేదు? నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేను. సంబంధిత మంత్రులు లేకుండా శాఖలపై రివ్యూ చేసిన నీచ చరిత్ర సీఎం కేసీఆర్‌ది’ అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
చదవండి: ఉన్నవి నిలుపుకొని.. కొన్ని కలుపుకొని..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement