సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) సోదాలు ముగిశాయి. ఈ నెల 14వ తేదీన ఉదయం ఆరుగంటల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్థన్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలు మొదలైన సంగతి విదితమే. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోదాలు ముగిసినట్లు ప్రకటించి అధికారులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ మూడు రోజుల సోదాల్లో.. కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లపై ఐటీ ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. అలాగే పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తీసుకెళ్లడం గమనార్హం. ఇక చివరగా సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ సోదాల పరిణామంపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు.
బురదజల్లే ప్రయత్నం
BRS నేతలను లక్ష్యంగా చేసుకుని.. కక్ష్య పూరితంగానే ఐటీ దాడులు జరిగాయన్న ఆయన.. సోదాల వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని చెప్పారు. ‘‘ఐటీ సోదాల గంటలోనే ముగిసినప్పటికీ.. అధికారులు 3రోజుల పాటు కాలయాపన చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మిగతా వ్యాపారలతో నాకు సంబంధం లేదు. విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలున్నాయన్నది పచ్చి అబద్ధం. మర్రి జనార్దన్, కొత్త ప్రభాకర్‌లతో మాత్రం వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం జరిగింది. నేను, నా భార్య ఇద్దరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. దానికి సంబంధించి పైల్స్ తీసుకున్నారంతే. సక్రమంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నాం. నేను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారు అధికారులు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు...అందులో ఉన్న డాక్యుమెంట్ లపై వివరాలు అడిగారు. ఏదో ఊహించుకుని ఐటీ అధికారులు వచ్చారు... కానీ ఏమీ దొరకలేదు. ఐటీ అధికారులకు మా సీఏ పూర్తి వివరాలు ఇచ్చారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారాయన.
డాక్యుమెంట్లు కీలకమైనవే!
ఇదిలా ఉంటే.. ఐటీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోలా ఉంది. ఎమ్మెల్యేకు కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులుకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది. తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా?
Comments
Please login to add a commentAdd a comment