సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కాంపై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, తమ పార్టీ పోరాటం కారణంగానే ఈ స్కాంలో కదలిక వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా అన్నారు. లిక్కర్ స్కాంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ స్కాంలో నిందితులకు ఎందుకు మద్దతు తెలుపుతుందని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్‌లతో కలసి మీడియాతో మాట్లాడుతూ తమ పోరాటం కారణంగానే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందని అన్నారు.
‘శంషాబాద్‌లో దిగగానే బీఆర్‌ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌లలో కేవలం కవిత మాత్రమే కనిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో ఇంకో మహిళా నాయకురాలు లేరా? కవితకు మహిళల సాధికారత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?’అని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మహిళల హక్కుల గురించి కవిత ఎన్ని పోరాటాలు చేశారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్ప ఇతర రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ పక్షాన సర్పంచ్ కూడా గెలవడని, అలాంటి పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు.
మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల డబ్బులు కొల్లగొట్టి ఎన్నికల కోసం డబ్బులు సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, బీజేపీతో పోరాడుతున్నామంటూ బీఆర్‌ఎస్ కలరింగ్ ఇస్తోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment