ఠాక్రే ట్రాన్స్‌ఫర్‌ | Congress party changed Manik Rao Thackeray as in-charge of Telangana | Sakshi
Sakshi News home page

ఠాక్రే ట్రాన్స్‌ఫర్‌

Published Sun, Dec 24 2023 4:40 AM | Last Updated on Sun, Dec 24 2023 4:40 AM

Congress party changed Manik Rao Thackeray as in-charge of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్‌రావ్‌ ఠాక్రేను ఆ బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం తప్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వ ఏర్పాటుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఇది కలకలం రేపింది. పార్టీ బాధ్యతల మార్పు అంశం మామూలే అయినా.. ఏడాది పాటు శ్రమించి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేసిన ఠాక్రేను.. అధికారం దక్కిన తర్వాత 20 రోజులకే తప్పించడం, వేరే రాష్ట్రానికి పంపడంపై టీపీసీసీ నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర ఇన్‌చార్జిని మార్చడంతో.. పార్టీకి సంబంధించి కీలక సమావేశాలన్నీ వాయిదాపడ్డాయి.  

టార్గెట్‌ పూర్తయిందనే..! 
ఠాక్రే మార్పు వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గాందీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను తెలంగాణకు పంపిన టార్గెట్‌ అయిపోయిందని, అందుకే ఇప్పుడు మరో రాష్ట్రానికి పంపారని.. అది కూడా ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు దగ్గరగా ఉండే గోవాకు పంపారని అంటున్నాయి. అయితే ఠాక్రే మాత్రం ఆవేదనతో గాం«దీభవన్‌ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. శనివారం సాయంత్రం అధిష్టానం ఈ నిర్ణయం ప్రకటించిన సమయంలో ఠాక్రే గాందీభవన్‌లోనే ఉన్నారు. డిసెంబర్‌ 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో నాగ్‌పూర్‌లో జరిగే సభకు జనసమీకరణపై మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ నేతలతో చర్చిస్తున్నారు. ఇన్‌చార్జి మార్పు విషయం తెలియడంతో ఉన్నట్టుండి సమావేశం నుంచి వెళ్లిపోయారని.. దీంతో నేతలు ఆందోళనకు గురయ్యారని తెలిసింది. 

కీలక సమయంలో మార్పు ఏమిటి? 
ఠాక్రే స్థానంలో దీపాదాస్‌మున్షీకి బాధ్యతలు అప్పగించారు. ఆమెను కేరళ, లక్షద్వీప్‌లకు పూర్తిస్థాయి ఇన్‌చార్జిగా నియమించగా.. అదనంగా తెలంగాణ బాధ్యతలు ఇస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. దీనిపై టీపీసీసీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘రాష్ట్రంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం చేయాల్సిన, అధిష్టానానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతలు రాష్ట్ర ఇన్‌చార్జికి ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో ఇన్‌చార్జి బాధ్యతలను అదనంగా వేరే రాష్ట్ర ఇన్‌చార్జులకు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుపట్టడం లేదు..’’అని వారు పేర్కొంటున్నారు. అయితే త్వరలోనే రాష్ట్రానికి కొత్త రెగ్యులర్‌ ఇన్‌చార్జిని నియమిస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. 

ఏడాది కూడా కాకుండానే.. 
కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిగా మాణిక్‌రావ్‌ ఠాక్రేను ఈ ఏడాది జనవరి 4న నియమించింది. వెంటనే రంగంలోకి దిగిన ఠాక్రే అలుపెరగకుండా పనిచేశారు. పూర్తిగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన.. తన సహ కార్యదర్శులతో కలసి టీపీసీసీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ, అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ముందుకెళ్లారు. ఎన్నికల ఎపిసోడ్‌ను విజయవంతంగా ముగించారు.

తాను ఇన్‌చార్జిగా ఉన్న రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో హుషారుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. గతంలో రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను అధిష్టానం గోవాకు ఇన్‌చార్జిగా పంపింది. ఇప్పుడు ఠాక్రేను కూడా గోవా ఇన్‌చార్జిగానే నియమించడం గమనార్హం. గోవా ఇన్‌చార్జిగా ఉన్న ఠాగూర్‌కు ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలను అప్పగించారు. 
 
కీలక సమావేశాలు వాయిదా! 
పార్టీ ఇన్‌చార్జి మార్పు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక సమావేశాలు వాయిదాపడ్డాయి. నిజానికి శనివారమే పార్టీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. వాటికి హాజరుకావాల్సిన నేతలకు సమాచారం ఇచ్చింది. కానీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆదివారం ఉదయం రెండు సమావేశాలు జరుగుతాయని.. వాటికి సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరవుతారని టీపీసీసీ నుంచి నేతలకు సమాచారం వెళ్లింది.కానీ కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో సమయం మార్చారు.

ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల సమావేశం జరుగుతుందని.. డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలు, అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు ఇందిరా భవన్‌లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఉంటుందని.. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులు, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్, మహిళా, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు. కానీ ఠాక్రే మార్పు నేపథ్యంలో ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. జనవరి మొదటి వారంలో వీటిని నిర్వహిస్తామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement