న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంల)పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీపార్టీ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుంచే గట్టి షాక్ తగిలింది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ విమర్శలను జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ మాట్లాడారు.
ఓడినప్పుడు మాత్రమే ఈవీఎంలను నిందించడం సరికాదన్నారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఒమర్ సూచించారు. ఎన్నికల్లో ఫలితం ఏదైనా అంగీకరించాలన్నారు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే వాటిపై పోరాటం చేయాలన్నారు. అవే ఈవీఎంల సాయంతో 100 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు, పార్టీ విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఒమర్ గుర్తుచేశారు.
కొన్ని నెలల తర్వాత తాము ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని ఈవీఎంలపై విమర్శలు చేయడం సరికాదనిదని ఒమర్ అన్నారు. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదని, ఓటమికి సాకుగా వాటిని చూపించకూడదన్నారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకుంటారన్నారు.
గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇందుకు ఓ ఉదాహరణ అని చెప్పారు. ఇటీవల జరిగిన హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment