సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల పిల్లలు వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టంచేశారు. ఈ పథకాలను ఆపేస్తోందంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని, ప్రభుత్వంపై బురదజల్లడాన్ని టీడీపీ మానుకోవాలని అన్నారు. మంత్రి అసెంబ్లీలో గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల ద్వారా నిరుపేదలకు మరింత ఆర్ధిక చేయూత ఇచ్చే సంకల్పంతో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు ఎగ్గొట్టిందని చెప్పారు. ఆ డబ్బు కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలకు రూ.40 వేలు ఇవ్వగా, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.లక్ష ఇస్తోందని తెలిపారు. వీరు కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచామన్నారు. గిరిజనులకు గతంలో రూ.50 వేలు ఇవ్వగా, ఈ రోజు రూ. లక్ష ఇస్తున్నామని, కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచామని తెలిపారు.
బీసీ వర్గాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.35 వేల నుంచి రూ.50 వేలకు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచామని వివరించారు. మైనార్టీలకు గతంలో రూ.50 వేలే ఇస్తే, ప్రస్తుతం రూ.లక్ష ఇస్తున్నామని చెప్పారు. వికలాంగులకు గతంలో రూ.లక్ష ఇవ్వగా, ఈరోజు రూ.1.50 లక్షలు ఇస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు గతంలో రూ.20 వేలు ఇస్తే, ప్రస్తుతం రూ.40 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తగా దూదేకుల, నూర్‌బాషా సామాజికవర్గాల వారిని మైనార్టీలుగా పరిగణించి, వారికి కూడా రూ.లక్ష చొప్పున ఇస్తున్నామని చెప్పారు.
ఈ విధంగా ఈ 4 ఏళ్లలో 35 వేల దంపతులకు రూ.267 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. ఈ పథకాల ద్వారా ఆర్ధిక సాయం ఒక్కటే కాదు.. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు వారి అక్షరాస్యతను పెంపొందించేలా నిబంధనలు పెట్టామన్నారు. మొదటి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆర్ధిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అత్యంత సమర్ధవంతంగా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి మాట్లాడుతూ నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకు కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు వరమేనని చెప్పారు. గొప్ప ఆశయంతో ఈ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయా వర్గాలు జీవితాంతం రుణపడి ఉంటాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment