
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పలు ప్రశ్నలు సంధించారు. దేశంలోని సగం జనాభా తిండీతిప్పలు లేకుండా అల్లాడుతుంటే ఈ సమయంలో కొత్తగా మరో పార్లమెంట్ భవనం అవసరమా అని సూటిగా ప్రశ్నించారు. కరోనా కాటుతో దేశ ఆర్థిక రంగం కుదేలైన వేళ ఇంతా భారీ వ్యయమెందుకని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడు జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్న కమల్ ఈ మేరకు మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
(చదవండి: నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి: ప్రపుల్ పటేల్)
‘దేశంలోని సంగం మందికి తిండి లభించడం లేదు. కరోనా వైరస్ కారణంగా అందరి జీవితాలు ప్రభావితమయ్యాయి. మీరేమో రూ.1000 కోట్లతో కొత్త పార్లమెంట్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా నిర్మించే క్రమలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు విడిస్తే.. ప్రజల్ని రక్షించేందుకు ఆ భారీ నిర్మాణం చేపట్టామని పాలకులు సెలవిచ్చారట. మీ ధోరణి కూడా అలాగే ఉంది. ఎవరిని రక్షించేందుకు మీరు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ప్రధాన మంత్రి మోదీ గారు’అని కమల్ సూటిగా ప్రశ్నించారు. కాగా, డిసెంబర్ 10న ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
(చదవండి: ఆవిష్కారం.. ఆత్మ నిర్భర్ భారతం)
Comments
Please login to add a commentAdd a comment