కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఊహించని షాక్ ఇచ్చారు. ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరతారనే ప్రచారం వేళ టీడీపీ, జనసేనలో టెన్షన్ మొదలైంది. దీంతో మధ్యవర్తులను రంగంలోకి దించింది. ముద్రగడను తమ పార్టీలోకి రావాలని జనసేన నేతలు ఆహ్వానించారు. కాపులంతా కలిసికట్టుగా ఉండాలని పవన్ చెప్పటం తనకు నచ్చిందని జనసేనలోకి రావాలని పవన్ కోరితే ఆలోచన చేస్తానని ముద్రగడ చెప్పారు. పవన్ స్వయంగా తానే ముద్రగడను ఆహ్వానిస్తారంటూ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.
ముద్రగడ, ఆయన కుమారుడుకు సీటు గురించి ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. ఇంతలో చంద్రబాబుతో పొత్తుతో ఉండటంతో పవన్‌కు సీఎం పదవిపైన నిర్ణయం ఏంటని ముద్రగడ స్పష్టత కోరారు. చంద్రబాబు నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి హామీ లేదని జనసేన నేతలు క్లారిటీ ఇచ్చారు. పవన్ ఆలోచన గురించి ఆరా తీశారు. పవన్ ఆలోచన ఏంటో పార్టీ నేతలు వివరించారు. దీంతో ముద్రగడ ఏకీభవించలేదు.
కాపుల ఐక్యంగా పని చేసి పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ అభ్యర్దులకు సహకరిస్తున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు. గెలిచిన తరువాత అధికారం మాత్రం కాపులకు లేకుండా చంద్రబాబుకే దక్కాలంటే అందుకు పని చేసేందుకు తాను సిద్దంగా లేనని ముద్రగడ తేల్చి చెప్పారని జనసేన నుంచి అందుతున్న సమాచారం. ముద్రగడకు సీటు విషయంలోనూ చంద్రబాబుతో చర్చించి చెబుతానని పార్టీ నేతలు చెప్పటం ముద్రగడకు ఆగ్రహం తెప్పించింది. అన్నింటికీ చంద్రబాబుపైనే ఆధారపడితే ఇక మీకు పార్టీ ఎందుకని ముద్రగడ ప్రశ్నించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారని ముద్రగడ తెలుసుకొనే ప్రయత్నం చేసారు.
ఆ విషయంలోనూ స్పష్టత లేదని నేతలు సమాధానం ఇచ్చారు. అసల ఏ ప్రాతిపదికన టీడీపీకి మద్దతిస్తున్నారంటూ ముద్రగడ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి మధ్యవర్తులు, జనసేన నేతల నుంచి సమాధానం రాలేదు. కాపులు కలిసి కట్టుగా ఉండాలని పవన్ చెబుతున్నది చంద్రబాబు పల్లకి మోయటానికి అంటూ ముద్రగడ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం.
దీంతో అన్ని విషయాలు పవన్ వస్తే ఆయనతోనే మాట్లాడుతానని ముద్రగడ తేల్చేసారని తెలుస్తోంది. పవన్ నిర్ణయాలను గౌరవిస్తామని సీఎం పదవిలో పవన్ కు షేరింగ్ ఉంటేనే తాను జనసేనలో చేరి గెలుపు కోసం పని చేస్తానని.. పవన్‌కు సీఎం పదవి లేకుంటే తాను చేరేది లేదని ముద్రగడ తేల్చేసిన అంశం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment