బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోలి ఓటర్లకు బంపరాఫర్ ఇచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటు వేయాలని, ఇందు కోసం ఒక్కొక్కరికి రూ.6,000 ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బు అందితేనే ఓటు వెయ్యాలని లేకపోతే వేయొద్దని స్పష్టం చేశారు.
బెలగావి రూరల్‌లోని సులేబావి గ్రామంలో రమేష్ జర్కిహోలి అభిమానులు శుక్రవారం ఓ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జర్కిహోలి.. ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష‍్మీ హెబ్బాల్కర్‌ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఆమె తన వల్లే గెలిచిందని, ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనివ్వొద్దని తేల్చి చెప్పారు.
నియోజకవర్గంలోని ఓటర్లకు లక్ష‍్మీ హెబ్బాల్కర్ మిక్సీలు, కిచెన్ సామాన్లు కానుకగా ఇస్తోందని, వాటి విలువ రూ.3,000 ఉంటుందని రమేశ్ పేర్కొన్నారు. అందుకు రెండింతల డబ్బు తాము ఇస్తామని, బీజేపీకే ఓటు వేయాలని సూచించారు. అయితే ఈ డబ్బులు తాను ఇవ్వనని, తన అభిమానులే సమీకరించి ఓటర్లకు పంపిణీ చేస్తారని జర్కిహోలి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందుకు రూ.10 కోట్లు అదనంగా తాము ఖర్చు చేస్తామన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందన..
అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష‍్మీ తోసిపుచ్చారు. మహిళలంటే రమేశ్ జర్కిహోలికి చులకన అని, ఎలాగైనా ఓడించాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరికీ కానుకలు, డబ్బు పంచలేదన్నారు. బహిరంగంగా ఓటర్లకు డబ్బు ఇస్తానని చెప్పిన రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సమయంలో రమేష్ జర్కిహోలి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి మారారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడంతో ఉపఎన్నికలు వచ్చి బీజేపీ గెలిచి అధికారం చేపట్టింది.
చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment