బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సిద్ధరామయ్య , పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే వారి మధ్య సీఎం కూర్చి కోసం కోల్డ్ వార్ మొదలైనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నువ్వా- నేనా
కాంగ్రెస్‌లోని ఈ ఇద్దరు నేతలు సీఎం అభ్యర్థి తామే అంటూ నేరుగా ప్రకటించకపోయినా సమయం వచ్చినప్పుడు పరోక్షంగా తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ఇప్పటికీ ఈ తరహా ఘటనలు జరిగినప్పటికీ తాజాగా డీకే శివకుమార్ ఈ అంశంలోకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తెరపైకి తేవడం రాజకీయంగా చర్చ మొదలైంది. దీంతో పాటు 'దళిత సీఎం' పార్టీలో ముందు నుంచీ ఉంటున్నవారు, మధ్యలో వచ్చినవారు.. అనే అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా సిద్ధరామయ్య అవకాశాలను చెక్‌పెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు.
సోమవారం శృంగేరిలో శివకుమార్ విలేకరులతో ఖర్గే అంశంపై మాట్లాడుతూ.... 'ఆయన (ఖర్గే) మా సీనియర్ నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు.. ఆయన సీఎం పదవి కోరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే తన కోరిక. ఆయన సీనియర్ నాయకుడని, గతంలో అన్యాయం జరిగిందని కొన్ని గొంతులు వినిపిస్తున్నాయి. పార్టీ ఏం చెబితే దానికి కట్టుబడి ఉండాలని.. అధిష్టానం ఏం చెబితే అది పాటిస్తామని, సిద్ధరామయ్య తదితరులు కూడా పార్టీకి కట్టుబడి ఉంటారని.. పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment