సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయాలని భావిస్తున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. దీంతో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పలువురు బీఆర్‌ఎస్ ఎంపీలు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు తిరుగుముఖం పడుతున్నారు.
తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ నందినగర్ నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ పార్టీ ఎంపీలతో మూకుమ్మడిగా కాకుండా ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ కావాలని నిర్ణయించారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటూనే పార్టీ ఎంపీలతో వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో విపక్షాలు అనుసరించే వ్యూహాలను కూడా అంచనా వేస్తున్నారు.
రాష్ట్రం నుంచే సోనియా పోటీపై విశ్లేషణ
కాంగ్రెస్ అగ్రనేత సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ఆహా్వనించడం, సీఎం, ఇతర మంత్రులు లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జిలుగా నియమితులు కావడం తదితర పరిణామాలను కూడా కేసీఆర్ నిశితంగా విశ్లేషిస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ సీట్లలో గెలుపొందిన బీజేపీ త్వరలో జరిగే ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు తదితర కోణాల్లో కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు.
ఎన్నికల సన్నద్ధతపై దిశా నిర్దేశం..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఓటమి పాలైన అభ్యర్థులను కలుపుకుని లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీ‹Ùరావు కూడా ఆ సన్నాహక సమావేశాలకు హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేసుకోవాలని ఎంపీలకు స్పష్టం చేయనున్నారు.
మళ్లీ మెదక్ నుంచేనా?
గతంలో మెదక్ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్ మరోమారు ఇక్కడి నుంచే లోక్‌సభ బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎంపీల్లో కొందరిని తప్పించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా పార్టీ లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment