సాక్షి, కరీంనగర్ : రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన స్పష్టమైన ప్రకటన ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో స్పష్టంగా కనిపించింది. ‘కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అవుతారు. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సీఎం అయితే తప్పేముంది?’ అని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వ్యాఖ్యానించి చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ మాటలు సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ‘సీఎంగా కేటీఆర్ సమర్థుడు’ అనే వాదనను తెరపైకి తెచ్చారు.
జిల్లాకు చెందిన మరో మంత్రి గంగుల కమలాకర్ కూడా హైదరాబాద్‌కు చెందిన పశుసంవర్థక శాఖ మంత్రితో కలిసి గత నెలాఖరులో మీడియాతో మాట్లాడుతూ ‘కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారనే విషయాన్ని పెద్దసారు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో సైతం ‘కేటీఆర్ సీఎం అవుతారు అనే మాటకు కట్టుబడి ఉన్నా’ అని పునరుద్ఘాటించారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ‘మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా...’ అని స్పష్టం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. సోమవారం ఉమ్మడి జిల్లాలో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా గంభీర వాతావరణంలో కార్యక్రమాలు సాగాయి.
చదవండి: కేటీఆర్ సీఎం ప్రచారంపై కేసీఆర్ క్లారిటీ
ఏక్ బార్.. అమ్మకముందే భారీ ఆదాయం..!
కేంద్ర చట్టాలపై ఆచితూచి మాట్లాడిన ‘ఈటల’
గత వారం హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన ‘రైతువేదిక’ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల్లో ఉత్సాహం నింపారు. నాలుగు రోజులపాటు సాగిన ఆయన పర్యటనల్లో మాట్లాడుతూ రైతు తాను పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 70 రోజులుగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అయితే కేంద్రం ప్రతి పాదించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒకరోజు బంద్ నిర్వహించిన టీఆర్‌ఎస్ తరువాత దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. మంత్రి ఈటల మాత్రమే తన గొంతును బలంగా వినిపించగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఈటల ను ప్రశంసిస్తూ బహిరంగ ప్రకటన చేశారు.
కాగా సోమవారం మంథనిలో రైతువేదిక ప్రారంభోత్సవంతోపాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఈటల ఆచితూచి మాట్లాడారు. వ్యవసాయ చట్టాల అమలులో కేంద్రం రైతుల సంక్షేమ బాధ్యత నుంచి తప్పుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఆందోళన, సంఘీభావం విషయాలను ఎక్క డా ప్రస్తావించలేదు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేసిన కృషిని, కాళేశ్వరం ప్రాజెక్టు, తీరిన విద్యుత్ కొరత వంటి అంశాలపై ప్రసంగంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రైతులు పడ్డ బాధల గురించి తనదైన ధోరణిలో విమర్శలు చేశారు. ఎంఎస్‌పీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని సుతిమెత్తగా డిమాండ్లు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశం ప్రభావం మంత్రి ఈటల ప్రసంగంపై పడిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
సిరిసిల్లలో ఉత్సాహంగా మంత్రి కేటీఆర్ పర్యటన
సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన సోమవారం సాగింది. గంభీర్రావు పేట మండలంలోని పలు కార్యక్రమాల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయనతోపాటు హాజరైన ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు వంటి వారు కూడా మంత్రి వెంట ఆహ్లాదంగా గడిపారు. ప్రసంగాల్లో ఎక్కడా రాజకీయ అంశాలు చోటు చేసుకోలేదు. కేవలం అభివృద్ధి, ముఖ్యమంత్రి చేస్తున్న కృషి గురించి మాత్రమే కేటీఆర్‌తోపాటు ఇతర నేతలు తమ ప్రసంగాల్లో వివరించారు. కార్యక్రమాలకు హాజరైన నాయకులు, పార్టీ శ్రేణులు కూడా ‘రాజకీయ’ వాతావరణం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
పార్టీ సభ్యత్వంపైనే అందరి దృష్టి
సీఎం మార్పుపై ఊహాగానాలకు తెరపడడంతో పార్టీ ప్రజాప్రతినిధులు సభ్యత్వ నమోదుపైనే దృష్టి సారించారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి నియోజకవర్గాల వారీగా సభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల వారీగా సభ్యత్వ నమోదుకు ఇన్‌చారి్జలను నియమించారు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌కు కోలేటి దామోదర్ గుప్త, పెద్దపల్లికి లోక బాపురెడ్డి, రాజన్న సిరిసిల్లకు కర్ర శ్రీహరి, జగిత్యాలకు ఎమ్మెల్సీ భానుప్రసాద రావును నియమించారు. సీఎం మార్పు ఉండబోదని, తానే మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎవరూ నోరు మెదపకూడదని కూడా పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment