తెలీదు.. గుర్తులేదు..ఏమో.. చంద్రబాబు నాయుడి దగ్గరనుంచి కిలారు రాజేష్ వరకు అంతా ఇదే పాట. విచారణాధికారులు ఏ ప్రశ్న వేసినా ఈ మూడే సమాధానాలు. 371 కోట్ల రూపాయల దోపిడీ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఆ లోకేష్ కి సన్నిహితుడు అయిన కిలారు రాజేష్ లు సిఐడీ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదు.
సిఐడీ నోటీసులు అందుకున్న వెంటనే అమాతం అదృశ్యమైన కిలారు రాజేష్ నెల తర్వాత సిఐడీ ముందు ప్రత్యక్షమై నేను విచారణకు సిద్ధమన్నాడు. మొదటి రోజు ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. రెండో రోజు విచారణకు పిలిస్తే వస్తానన్న కిలారు మళ్లీ మాయమయ్యాడు. విజయదశమి పండగ తర్వాత వస్తానంటూ లేఖ పంపాడు.
స్కిల్ స్కాంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి హవాలా రూపంలో తమ దగ్గరకు రప్పించుకున్న చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 9న అరెస్ట్ అయ్యారు. దానికి నాలుగు రోజుల ముందు హవాలా రూపంలో డబ్బును చంద్రబాబు నాయుడు, నారాలోకేష్ లకు తరలించిన చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లకు సిఐడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే నోటీసులు అందుకున్న రోజునుంచే ఇద్దరూ మాయమయ్యారు. ఒకరు దుబాయ్ కి మరొకరు అమెరికాకి పరారయ్యారని ప్రచారం జరిగింది.
నెల రోజుల తర్వాత సిఐడీ ముందు ప్రత్యక్షమైన కిలారు రాజేష్ తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఏపీలోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఎక్కడికీ పారిపోకపోతే సిఐడీ నోటీసులకు ఇంత వరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకు విచారణకు హాజరు కాలేదు? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఏపీలోనే ఉన్నాడా.. లేక లోకేష్ తో పాటు ఢిల్లీలో రహస్య స్థావరంలో తలదాచుకున్నాడా అన్నది కూడా తెలీదు. సరే విచారణకు సిద్ధమంటూ వచ్చాడు కాబట్టి సిఐడీ విచారణ మొదలు పెట్టింది. మొదటి రోజు విచారణ సందర్భంగా సిఐడీ ఏ ప్రశ్న వేసినా సరిగ్గా సమాధానం చెప్పలేదని సమాచారం. ఇంతకాలం ఎక్కడున్నావు అని అడిగితే ఏపీలోనే అన్నాడు.
ఏపీలో ఎక్కడ ఉన్నావని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదట. లోకేష్ తో ఎంతకాలం నుంచి పరిచయం ఉంది అని అడిగితే సమాధానం లేదు. నారా లోకేష్ కు డబ్బు అందించిన విషయంపై అడిగితే ఏం మాట్లాడకుడా మౌనంగా ఉండిపోయాడట. షెల్ కంపెనీల సృష్టికర్త మనోజ్ వాసుదేవ్ పార్ధసాని గురించి అడిగితే అతనెవరో తెలీదన్నాడట. తీరా వాసుదేవ్ -రాజేష్ ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ చూపించగానే నీళ్లు నమిలి బిక్కమొగం వేశాడట. 25 ప్రశ్నలు సంధిస్తే తెలీదు.. గుర్తులేదు..ఏమో అన్న సమాధానాలే ఇచ్చాడట.
మొదటి రోజు విచారణ పూర్తికాగానే బయటకు వచ్చిన రాజేష్ తనని రెండో రోజు కూడా విచారణకు రమ్మన్నారని తాను కచ్చితంగా వస్తానని చెప్పాడు. రెండో రోజు ఉదయం రాజేష్ కోసం సిఐడీ పోలీసులు ఎదురు చూస్తోన్న తరుణంలో సిఐడీ వారు అడిగిన డాక్యుమెంట్లు తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుందని..దసరా పండగ తర్వాతనే తాను విచారణకు వస్తానని లేఖ పంపాడు రాజేష్.
మొదటి రోజు మీడియా ముందు పెద్ద బిల్డప్ ఇచ్చిన రాజేష్ సిఐడీ మొదటి రోజు విచారణతోనే డంగైపోయాడు. తాను తప్పించుకునే పరిస్థితి లేదని అర్ధమైందో ఏమో కానీ.. రెండో రోజు విచారణకు గైర్హాజరయ్యాడు. మళ్లీ లోకేష్ ను కలిసి సిఐడీ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలో క్లారిటీ తీసుకున్న తర్వాతనే రాజేష్ సిఐడీ ముందుకు వస్తాడని భావిస్తున్నారు.
చిత్రం ఏంటంటే ఈకేసులో విచారణ ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు సైతం సిఐడీ ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తులేదు..ఏమో అన్న సమాధానాలే ఇచ్చి విచారణకు ఏ మాత్రం సహకరించలేదని సిఐడీ పోలీసులే కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం విచారణలో నారా లోకేష్ కూడా అచ్చం ఇవే సమాధానాలు చెప్పి సిఐడీకి సహకరించకుండా వెళ్లిపోయాడు. ఇపుడు రాజేష్ కూడ అదే తంతు. అంతా కూడా ఒకే స్కూల్లో చదువుకున్నట్లు..ఒకేలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందంటున్నారు సిఐడీ పోలీసులు. నెల రోజుల పైగా రాజేష్‌కు ఇలాంటి సమాధానాలు చెప్పాల్సిందిగా లోకేష్ మంచి ట్రెయినింగ్ ఇప్పించారని అంటున్నారు.
- సీఎన్‌ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment