సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ నేత కిలారు రాజేష్‌ను ఏపీ సీఐడీ సోమవారం తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో స్కామ్‌కు సంబంధించి ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు అధికారులు యత్నించారు. అయితే విచారణలో అధికారులు వేసిన ప్రశ్నలకు మౌనంగా ఉండడం.. కొన్నింటికి తెలియదనే సమాధానం ఇవ్వడంతో మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఆయన్ని కోరారు.
స్కిల్ స్కామ్‌కు సంబంధించి కిలారు రాజేష్‌కు సీఐడీ అధికారులు 25 ప్రశ్నల దాకా అడిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఏడు గంటలపాటు రాజేష్ విచారణ కొనసాగింది. ప్రధానంగా మనోజ్ వాసుదేవ్ పార్థసానితో సంబంధాలపైనా ప్రశ్నలు వేసింది. అయితే.. పార్థసాని ఎవరో తనకు తెలియదని రాజేష్ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో సీఐడీ అధికారులు పార్థసానితో జరిగిన వాట్సాప్ ఛాటింగ్, నగదు ట్రాన్‌జాక్షన్స్ వివరాలను కిలారు రాజేష్ ముందు పెట్టడంతో ఆయన ఖంగుతిన్నారు. అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు.
ఆపై.. నారా లోకేష్‌తో పరిచయం, వ్యాపారాల గురించి సీఐడీ ఆరా తీసింది. కానీ, దానికి ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు. ఆపై షెల్ కంపెనీల నుంచి వచ్చిన నగదును ఎవరెవరికి చేరవేశారని ఆరా తీశారు అధికారులు. కానీ, ఆ ప్రశ్నకు కూడా తెలియదంటూనే సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది.
చివరగా.. చంద్రబాబు, లోకేష్‌లతో జరిపిన మెయిల్స్ సంభాషణలపైనా సీఐడీ ఆరా తీసింది. తాను మెయిల్స్ చేయలేదు అనడంతో.. కొన్ని మెయిల్స్ వివరాల్ని రాజేష్ ముందు పెట్టారు అధికారులు. అది చూసి ‘‘తెలియదు.. గుర్తు లేదు..’’ అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలో కీలక ప్రశ్నలకే ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి రేపు(మంగళవారం, అక్టోబర్ 17న) విచారణకు రావాలని కిలారు రాజేష్‌ను సీఐడీ కోరింది.
స్కిల్ స్కామ్‌కు సంబంధించిన విచారణ కోసం హాజరు కావాలని సీఐడీ అధికారులు కిలారు రాజేష్‌కు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు ఆయన ఈ కేసులో అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. స్కిల్ కేసులో రాజేష్‌ను నిందితుడిగా చేర్చలేదని, అవసరమైతే సీఆర్పీసీ 41 A ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ, కోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment