సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తనదైన శైలిలో క్లాస్ పీకారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప మీడియా ఎదుట నిరసనలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, తమాషాలొద్దు... అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. కొత్తవారిని ప్రకటించడంపై మరో వర్గం రగిలిపోయింది. ఎంపీ అర్వింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని ఈ వర్గం ఆరోపిస్తోంది.
ఈక్రమంలో బుధవారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు చెందిన అసమ్మతి నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అసమ్మతి నేతలను పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళన చేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.
ఆ జిల్లాలో అన్ని సెగ్మెంట్లలోనూ పోటాపోటీ
నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటి నుంచే టికెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. నిజా మాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఎంపీ అర్వింద్ ప్రోత్సాహంతో ధన్‌పాల్ సూర్యనారా యణ గుప్త కూడా అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్‌రెడ్డి అక్కడ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక బోధన్ నియోజకవర్గం నుంచి ప్రకాశ్‌రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది.
అయితే మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంతమంది అసమ్మతి వర్గా నికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాల యానికి చేరింది. కాగా, ఎంపీ అర్వింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment