తాడూరి శ్రీనివాస్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఈటల
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
బీజేపీలో చేరిన ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, ఏం చేశారని మీటింగ్‌లు పెట్టి ఓట్లు అడుగుతారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? ఇప్పుడు వాటి కి కాంగ్రెస్ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది’అని విమర్శించారు.
శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తాడూరి శ్రీనివాస్‌తో పాటు ఉప్పల్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్త లు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంరావాలని, అప్పుడే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా చెబుతున్నారన్నారు.
‘రాహుల్ ప్రధాని కాలేరు, కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయలేదు’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలున్నాయని, బీజీపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కరెంటు కోతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, పార్టీ అధికార ప్రతి నిధి ఎన్.వి.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment