ఒక చదరపు మీటర్‌కు ఇంత అని రేట్ పెట్టి వసూలు చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
లిక్కర్ స్కాంపై కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్‌లో కూర్చుని ఆర్‌జీ (రాహుల్ గాంధీ) ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. ఒక చదరపు మీటర్‌కు ఇంత అని రేటు పెట్టి మరీ.. కంపెనీలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నడిచేందుకు తెలంగాణ సొమ్ముపైనే ఆధారపడుతోంది. గతంలో తమిళ నాడు, ఆ తర్వాత కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ వసూ ళ్లకు అడ్డాగా మారింది..’’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
శనివా రం ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీశ్‌బాబు, నేతలతో కలసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన వివిధ సెటిల్‌మెంట్లను రాహుల్‌గాంధీ మనుషులు మళ్లీ బయటికి తీస్తున్నారని.. ఢిల్లీ వెళ్లి మాట్లాడుకుని, ఆర్‌జీ ట్యాక్స్ చెల్లించి రావాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ భూలావాదేవీలు అంటూ గతంలో ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు వాటిపై దర్యాప్తు చేసే పరిస్థితి లేదన్నారు.
బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్..:
హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా అక్రమార్కులకు అప్పజెప్పారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు? బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. సెటిల్‌మెంట్ రాజకీయాలు చేస్తోంది’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు దీనంతటినీ భరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అప్పట్లో రేవంత్ అన్నారని.. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలని తనకు సవాల్ చేశారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ అధికారంలో ఉన్నారని, కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్‌ఎస్ పాత్ర అప్రస్తుతమై పోయిందని, అసలు ఆ పార్టీ పోటీచేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఏమైనా ఉంటే అది కాంగ్రెస్‌తోనేనని పేర్కొన్నారు.
లిక్కర్ స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో వందల కోట్లు చేతులు మారాయని తాను నిరూపిస్తానని, అది తప్పని మాజీ సీఎం కేసీఆర్ చెప్పగలరా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు ధైర్యముంటే ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే.. అది ప్రజాస్వామ్యానికి చీకటిరోజు, కక్షసాధింపు ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను కేసీఆర్ బ్లాక్‌డే అనడం గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. తన కుమార్తె కవిత అరెస్ట్ అయినప్పుడు స్పందించని కేసీఆర్.. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక స్పందించడం వెనక మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఆ అరెస్ట్‌లతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment