బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా | Komatireddy Rajagopal Reddy Resigns To BJP - Sakshi
Sakshi News home page

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

Published Wed, Oct 25 2023 11:42 AM | Last Updated on Wed, Oct 25 2023 12:21 PM

Komatireddy Rajagopal Reddy Resigns To Bjp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

‘‘కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో  ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

‘‘ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది.  ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను.

తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ  పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి  జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆశీస్సులతో  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్‌ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్  నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల  కేసీఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పింది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. 

నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, నేడు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కెసిఆర్ పాలనను  అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను  ఆదరించాలని రాష్ట్ర ప్రజలని  కోరుతున్నాను’’ అని రాజగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: టీ కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌ రెడీ.. ప్రాబబుల్స్‌ జాబితా ఇదే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement