ఈ మధ్య ఒక సినిమా డైలాగు విన్నాను. హీరోయిన్ అనుకుంటా.. ఆమె బహుశా హీరోని ఉద్దేశించి అయి ఉండవచ్చు. ' నీవు ఇంతకన్నా దిగజారవు అనుకున్నప్పుడల్లా నా అభిప్రాయం తప్పు అని రుజువు చేస్తూనే ఉన్నావు" అని ఆమె అంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ డైలాగు వర్తిస్తుంది. రాజకీయాలలో సినిమా డైలాగులు వాడుకుంటే ఫర్వాలేదు కాని.. అచ్చం సినిమాలో మాదిరి వ్యవహరించాలనుకుంటే తెలివి తక్కువతనం అవుతుంది. పవన్ కల్యాణ్ ఏపీలో మహిళల అక్రమ రవాణా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి.
తాను పవిత్రంగా భావించే వారాహి అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి ఇలాంటి అప్రాచ్యపు విషయాలా సంబాషించేది.! అందులోను వలంటీర్లపై ఆయన వ్యక్తపరచిన భావాలు దారుణమైనవి. ఇది కూడా సినిమా డైలాగులాగానో, అదేదో తానే చూసినట్లో మాట్లాడిన తీరు ఆయనను రాజకీయంగా, వ్యక్తిగతంగా మరింత పాతాళానికి తీసుకు వెళ్లింది. మహిళల మిస్సింగ్ కేసులుకాని, పురుషుల మిస్సింగ్ కేసులు కాని పలు రకాలుగా ఉంటాయి. ఎవరు మిస్ అయినా ఆ కుటుంబానికి తీరని బాధే. కాని వాటిలో 99.9 శాతం వ్యక్తిగత కారణాలతోనే జరుగుతుంటాయి.
ప్రేమ విఫలం అయిందనో, ఇంట్లో కోప్పడ్డారనో ఇంకా రకరకాల కారణాలతో మిస్ అవుతుంటారు. కొన్ని సందర్భాలలో కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. కొంతమంది దుర్మార్గులు అపహరణ చేయడమో, ప్రలోభాలకు గురి చేయడమో చేస్తుంటారు. అవన్ని సమాజంలో జరిగే కొన్ని నేరాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ మాటకు వస్తే తెలంగాణలో ఏపీలో కన్నా ఎక్కువ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే తెలంగాణకు వెళ్లి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి చూడమనండి.
చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి ఎల్లో మీడియా అండ చూసుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు, ఆయనకు ఉన్న ఆర్దిక వనరులు చూసుకుని పవన్ కల్యాణ్ ఏపీలో చెలరేగిపోతున్నారు. బహుశా ఇలా నీచంగా మాట్లాడితే ఎవరో ఒకరు తనపై ఏదైనా రాయి విసరకపోతారా?. లేక ఏదైనా చిన్న గొడవ చేయకపోతారా? ఆ తర్వాత ఇంకేముంది శాంతిభద్రతులు లేవని ప్రచారం చేయవచ్చన్న దుష్టతలంపుతో ఇలాంటి కవ్వింపు మాటలు మాట్లాడి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా, అంతా ప్రశాంతంగా ఉండడంతో ఈయనను ప్రయోగించి ఉండవచ్చని కొందరు అనుమానం.పైగా ఈ దిక్కుమాలిన వ్యవహారాలను వలంటీర్లకు, వైసీపీ నేతలకు, ప్రభుత్వంలోని పెద్దలంటూ ఆపాదించి పవన్ కళ్యాణ్ తన హీన బుద్దిని ప్రదర్శించుకున్నారు.
ఎదుటివారిని రాజకీయంగా ట్రాప్ వేయడానికి కొన్నిసార్లు ఇలా చేస్తుంటారు. కాని పవన్ కల్యాణ్‌కు ఆ తెలివితేటలు కూడా ఉన్నాయని అనుకోవడం లేదు. తనకు స్క్రిప్టు ఇచ్చినవారు రాసిన దానికన్నా అధికంగా ఏమైనా మాట్లాడి బురదలో పడ్డారేమో తెలియదు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ ట్రాప్‌లో ఆయన పడినట్లు అనిపిస్తుంది. ఈ మధ్య పవన్‌కు కౌంటర్ ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన పేరు చెప్పకుండా దత్తపుత్రుడు మాదిరి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించలేమని అన్నారు. ఆ తదుపరి కొద్ది రోజులకే ఎల్లో మీడియాతో సహా అన్ని మీడియాలలో పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా ముగిసిపోయినట్లేనని కథనాలు వచ్చాయి. దాంతో పవన్ కళ్యాణ్ పరువు పూర్తిగా పోయింది.
ఈ కారణంగా ప్రస్టేషన్‌కు గురైన పవన్ ఇలా పిచ్చి డైలాగులతో ఏదో చేసేయాలనుకుని తానే దెబ్బతిన్నారు. అసలు ఇలాంటి కొన్ని నేరాలు జరగడానికి సినిమాలు కూడా కారణమే అని చెప్పాలి. ఆడపిల్ల తను ప్రేమించిన వ్యక్తి కోసం ఎలా పారిపోవాలో ఈ సినిమాలలో చూపిస్తుంటారు. వాటిని నేర్చుకుని కూడా కొందరు అలా పారిపోతుంటారు. సినిమా హీరోలు, నటీ, నటుల అక్రమ సంబంధాల గురించి పలు వార్తలనండి.. ఊహాగానాలు అనండి వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజాలు ఉండవచ్చు. మరికొన్ని అవాస్తవాలు కావచ్చు. కాని అమాయక జనం వాటి ప్రభావానికి గురి అవుతుంటారు.
ఎవరైనా ఒక హీరో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా, అదేదో గొప్ప విషయం లా ఫీల్ అయ్యే అమాయకపు అభిమానులు ఉండవచ్చు. ఎవరైనా ఒక హీరో తాను పెళ్లి చేసుకున్న మహిళ ఇంటిలో ఉండగానే, మరో యువతిని తెచ్చి అక్రమ సంబందం పెట్టుకుంటే సపోర్టు చేసే మూర్ఖపు అభిమానులు కూడా ఉండవచ్చు. అలాంటి సన్నివేశాలలో సంబంధిత హీరో అసలు భార్య ఇంటి నుంచి వెళ్లిపోతే అది కూడా మిస్సింగ్ కేసే అవుతుంది. పవన్‌కు ఆ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు.
దానికి ఎవరు బాధ్యత వహించాలో తెలియకపోవచ్చు. ఒక సినీ హీరో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయినా, రాష్ట్ర ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్పదలిస్తే మనం ఏమి చేయగలుగుతాం. కొన్నాళ్లపాటు ఆమె ఎక్కడో తలదాచుకుని, వివాహ బంధం తెంచుకున్న తర్వాత కూడా మరో పెళ్లి చేసుకోరాదని దారుణంగా ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే సాడిస్టు అభిమానులు ఉన్న సమాజం మనది. బహుశా పవన్ కళ్యాణ్ వంటి సినిమా నటులకు అలాంటి సాడిస్టులంటేనే ఇష్టం ఉండవచ్చు. కాని సాధారణ సభ్య సమాజం అలాంటి వాటిని అంగీకరించదు. ఆ సంగతిని ఆయన గుర్తించాలి.
చదవండి: ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై అడ్డగోలు వాగింది!
మహిళల జీవితాలతో ఆడుకున్న వ్యక్తులు సైతం నీతులు చెప్పే కాలమిది. ఏమి చేస్తాం. తప్పదు అన్నీ భరించాల్సిందే. ఇక్కడ విశేషం ఏమిటంటే పవన్ కల్యాణ్‌కు మహిళల అక్రమ రవాణా గురించి ఎవరో కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయట. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పవాడు ఏమైనా చెబుతాడన్నది సామెత. ఏపీ ప్రభుత్వం అంటే కేంద్రానికి భయమా? నిజంగా అలాంటివి జరుగుతుంటే బహిరంగంగానే కేంద్రం ప్రకటిస్తుంది. రాష్ట్ర అధికారులకు రిపోర్టు పంపుతుంది తప్ప పవన్ కు చెవిలో చెప్పి పంపరు. బహుశా ఎవరైనా తెలివితక్కువవారు పవన్ కళ్యాణ్‌కు అలాంటి మాటలుచెప్పారేమో తెలియదు. కాని ప్రసంగించిన తీరు చూస్తే ఎల్లో మీడియా రాసిచ్చినవాటిని కనీస ఆలోచన చేయకుండా చదివినట్లు అనిపిస్తుంది.
తద్వారా టీడీపీ అనుకూల శక్తులు పవన్‌ను తమ గుప్పిట్లోనే ఉండేలా చేసుకోగలుగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థ అన్నది ఒక స్పెషల్. దాని ద్వారా లక్షలాది కుటుంబాలు సేవలు పొందుతున్నాయి. ప్రత్యేకించి ప్రతి నెల ఫస్ట్ తేదీన వృద్దులకు పెన్షన్‌ను ఇంటికి వెళ్లి తీసుకు వెళ్లడం నుంచి వరదలు వస్తే సాయపడడం వరకు అనేక పౌర సేవలను అందిస్తున్న వలంటీర్లను ఉద్దేశించి అంత మాటఅనడానికి పవన్‌కు నోరు ఎలా వచ్చిందో అర్దం కాదు. వలంటీర్లలో లక్షమందికిపైగానే మహిళలు కూడా ఉంటారు. అలాంటివారు ఇలాంటి ఛండాలపు పనికి సహకరిస్తున్నారని, ఏదేదో సమాచారం సేకరిస్తున్నారని తెలిసీ, తెలియని మాటలు అంటే ఆ వలంటీర్లు ఎంత ఆవేదనకు గురి అవుతారు!
మహిళల అక్రమ రవాణా కేసులు వంటి నేరాలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరిగాయి. గత చంద్రబాబు ప్రభుత్వ టైమ్ తో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వం టైమ్‌లో ఇవి తక్కువగానే ఉన్నాయి. అలాగే అప్పుడు మిస్ అయిన వారిని ట్రేస్ చేశారు. ఇప్పుడు కూడా ట్రేస్ చేస్తున్నారు. వీటిలో అత్యధికం వ్యక్తిగత కేసులే. దానికి ప్రభుత్వానికి లింక్ చేసి ముఖ్యమంత్రి జగన్‌పై తనకు ఉన్న విద్వేషాన్ని, కక్షను వెళ్లగక్కి తానేదో సాధించాలని పవన్ అనుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మహిళల మిస్సింగ్ కేసుల గురించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదు.
అప్పుడు ఎవరు మిస్ అయినా ఫర్వాలేదని ఆయన అనుకున్నారా? ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలోకి వస్తే ఎంత నీచంగా ప్రవర్తిస్తారో ఆయనే సమాజానికి తెలియచేసుకున్నారు. అంతా అయిపోయాక జనసేన పార్టీపరంగా ఎవరో ఖండన ఇచ్చి అబ్బే అలా అనలేదు.. ఇలా అనలేదు.. వక్రీకరించారు అని సన్నాయి నొక్కుడు నొక్కినా, పవన్ మాట్లాడిన వీడియోలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఏదో రకంగా పవన్ తన వ్యాఖ్యలను సమర్దించుకోవడం వెనుక ఉన్న లక్ష్యం అర్ధం అవుతుంది. వలంటీర్ల వ్యవస్థను డీమోరలైజ్ చేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉంది. అందుకే ఇలా అనుచితంగా మాట్లాడుతున్నారు. తన భార్యకు విడాకులు ఇచ్చారని వార్తలు వస్తేనే అంతమాట అంటారా అని చించుకున్న ఆయన వలంటీర్లను ఉద్దేశించి ఇంతటి ఘోరమైన వ్యాఖ్యలు చేయడం ఎలా సమంజసమని అనుకున్నారో తెలియదు.
కరోనా సమయంలో ఏపీలో వలంటీర్లు అందించిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన సంగతి ఆయనకు తెలియదా? ఒకసారి ఏదైనా గ్రామానికి వెళ్లి వలంటీర్లతో కలిసి పవన్ తిరిగితే వారి విలువ ఏమిటో తెలిసేది. గతంలో చంద్రబాబునాయుడు ఇలాగే వలంటీర్లను మూటలుమూసే ఉద్యోగమని, ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడతారని ఏదేదో మాట్లాడి అభాసుపాలయ్యారు. అదే చంద్రబాబు తాము వస్తే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పలేకపోతున్నారు. పైగా టీడీపీ వారికి అవకాశం ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు దారిలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసి దొరికిపోయారు. అసలు పవన్ కల్యాణ్‌కు నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే వారిని అవమానించే రీతిలో ఉపన్యాసాలు చేస్తారా? సొంత ఆలోచనలు కాకుండా, ఎవరో బుర్రతో ఆలోచించి ప్రసంగాలు చేస్తే ఇలాగే ఉంటుంది.
ఎవరినో మెప్పించడానికిగాను పవన్ తాను పరువు పోగొట్టుకుంటున్నారు. అసలు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పలేని దైన్య స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటే అయ్యే పనికాదని తెలుసుకోవాలి. అందుకే వలంటీర్లు కాని సమాజంలోని ఆయా వర్గాలు కాని పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎవరివో గుడ్డలూడదీస్తానని చెబుతున్నారు కాని, ఆయనకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన బట్టలు తానే ఊడదీసుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment