ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుల ప్రసంగాలలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. జగన్ వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా, అధిక భాగం విధానాలకు పరిమితం అవుతుంటే, చంద్రబాబు మాత్రం అత్యధిక శాతం వ్యక్తిగత నిందారోపణలకే పరిమితం అవుతున్నారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో చేసిన కొన్ని ప్రసంగాలను చూద్దాం. సత్యసాయి జిల్లాలో, శ్రీకాకుళంలో జరిగిన సభలలో జగన్ ఉపన్యసిస్తూ, అప్పటివరకు ప్రతిపక్షపార్టీల నేతలు చేస్తున్న విమర్శలకు బదులు ఇచ్చారు.
చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా!
చంద్రబాబు రోజూ ఏదో రూపంలో జగన్‌ను విమర్శిస్తుంటే, జగన్ మాత్రం ఇలా పబ్లిక్ కార్యక్రమాలలోనే తన అభిప్రాయాలు చెబుతుండడం విశేషం. మిగిలిన రోజుల్లో చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఇతర నేతలు బదులు ఇస్తుంటారు. కాని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన చాలా వరకు హుందాగా ఉంటూ, రోజూ ఏదో విమర్శ చేయాలని తాపత్రయపడడం లేదు.
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో, ప్రతిపక్షనేత పదవిలో ఉన్న చంద్రబాబు మాత్రం మీడియా సమావేశాలు పెట్టో, జూమ్ లోనో, లేదా లీక్ ద్వారానో జగన్‌ను గంటల తరబడి తిడుతూ ఉంటారు. జగన్ ప్రసంగంలో కొన్ని భాగాలు పరిశీలిద్దాం. రైతులకు మేలు చేయడంలో తాము పోటీపడుతున్నది ప్రతిపక్షాలతో కాదని, దేశంతో అని జగన్ చెప్పారు. వివిధ రాష్ట్రాల అధికారులు ప్రతినిధి బృందాలు వచ్చి ఏపీలో రైతులకు అమలు చేస్తున్న కార్యక్రమాలు చూసి వెళ్లి వారి రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని యత్నిస్తున్నారని ఆయన వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు బీమా పథకం అమలుకు, తన ప్రభుత్వం అమలు చేస్తున్న తీరుకు ఆయన తేడాను వివరించారు. అప్పుడు ఎంత డబ్బు ఇచ్చింది.. ఇప్పుడు ఎంత అధికంగా డబ్బు రైతులకు ఇస్తున్నది ఆయన వివరించారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు జరుగుతున్న మేళ్లను వివరించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తాము చెల్లించామని ఆయన వివరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా పేరుతో అనంతపురం జిల్లాలో చేసిన పర్యటనకు బదులు ఇస్తూ, ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు తరపు కుటుంబం అయినా, తమకు పరిహారం అందలేదని చెప్పారా అని సీఎం సవాల్ చేశారు. పిల్లలకు నాణ్యమైన చదువులు ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతంపై వచ్చిన విమర్శలకు బదులుగా చెప్పారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వైసీపీ ప్రస్తుత మానిఫెస్టో, 2014లో టీడీపీ మానిఫెస్టో రెండిటిని ఆయన తీసుకు వచ్చి వాటి అమలును పోల్చి చూడాలని జగన్ కోరుతున్నారు.
ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే మంత్రి ఇల్లు దగ్ధం చేస్తారా అని టీడీపీ, జనసేనలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 లను ఆయన దుష్టచతుష్టతయంతో పోల్చి వారికి దత్తపుత్రుడు తోడు అవుతున్నారని పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఎక్కడా చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడంలేదు. అయితే చంద్రబాబు, లోకేష్‌లు తరచు ఏం పీకావు అంటూ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మాత్రం జగన్ వీరంతా కలిసినా తన తల వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఒక్కటి మినహా మిగిలిన స్పీచ్ అంతా తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చెప్పడానికే టైమ్ కేటాయిస్తున్నారు.
జగన్ చేస్తున్న వాదనలోని అంశాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాని, పవన్ కల్యాణ్ కాని ఎన్నడైనా జవాబు ఇచ్చారా? రైతు భరోసా కేంద్రాలు వృథా అని వారు ఎప్పుడైనా అనగలిగారా? వాటి ద్వారా ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు తదితర అవసరాలు రైతులకు అందుతున్నాయా? లేదా? ఈ క్రాప్ ద్వారా రైతులకు ప్రయోజనం ఉందా? లేదా ? అమ్మ ఒడి కొనసాగాలా? వద్దా? స్కూళ్లను బాగు చేయడం సరైనదా?కాదా? వీటి గురించి ప్రతిపక్షం ప్రస్తావించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆహ్వానించవలసిందే. అలా కాకుండా చంద్రబాబు జనరల్ విమర్శలు చేయడమో లేక, దూషణలకు దిగడమో చేస్తున్నారు.
ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టి ఏమి మాట్లాడారు? రాష్ట్రం వల్లకాడు అవుతోందట. గతంలో ఒకసారి మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రాజధాని ప్రాంతంలో పిచ్చి చెట్లు పెరిగి స్మశానం మాదిరిగా తయారైందని వ్యాఖ్యానిస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిని స్మశానంతో పోల్చుతావా అని గద్దించారు. కాని ఇప్పుడు అదే చంద్రబాబు ఏకంగా రాష్ట్రం అంతటిని వల్లకాడు అంటున్నారు.ఇది ఎంత దారుణం.
వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపితే డీజీపీ ఏమి చేస్తున్నారని చంద్రబాబు అనడంలో ఏమైనా అర్థం ఉందా? ఈ హత్యను కప్పిపుచ్చుకోవడానికి కోనసీమలో చిచ్చు పెట్టారట. గతంలో పోలీసులు తీవ్రవాదం, మతకల్లోలాలు, ప్యాక్షనిజం, రౌడీయిజం పై పోరాడి అదుపు చేసి ప్రజల ప్రశంసలు పొందరని కాని ఇప్పుడు నేరగాళ్లతో చేతులు కలుపుతున్నారట. ఎవరు ఆ నేరగాళ్లు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబేనా ఇలా మాట్లాడేది. తన పార్టీవారు, జనసేనవారు కలిసి మంత్రి విశ్వరూప్ ఇంటిని దగ్దం చేస్తే కనీసం బాధపడకుండా ఇంత హేయంగా మాట్లాడడం ఆయనకే చెల్లింది.
పదహారు కేసుల్లో నిందితుడుగా ఉన్న ఒక నేరగాడు పీఠం మీద కూర్చుని ఆదేశిస్తే పోలీసులు మిగిలిన పార్టీల హక్కులను హరిస్తారా? అని ఆయన అంటున్నారు. నిందితుడు అని ఆయనే చెబుతారు. అంతలోనే నేరగాడు అని అనేస్తారు. నిందితుడికి, నేరస్తుడికి ఉన్న తేడా ఏమిటో కూడా చంద్రబాబుకు తెలియదా? అసలు ఒక సీఎంను పట్టుకుని ఇలా ద్వేషంతో మాట్లాడవచ్చా? మరి గతంలో చంద్రబాబుపై పడిన కేసుల సంగతేమిటి? ఓటుకు నోటు కేసు విషయం ఏమిటి? ఆయన హయాంలో జరిగిన ఎన్ కౌంటర్లు ఏమిటి? గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది చనిపోతే చివరికి కానిస్టేబుల్‌పై కేసు పెట్టని పోలీసు వ్యవస్థ సమర్థవంతమైనదని ప్రజలు మెచ్చుకున్నారట. చంద్రబాబు ఇలా చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట.
ఇంటెలెజెన్స్ అధికారులు.. టీడీపీ హయాంలో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో బిజిగా ఉంటే వారు చాలా బాగా పనిచేశారని చంద్రబాబు చెబుతున్నారన్నమాట. ఏదైనా హేతుబద్దంగా మాట్లాడితే విలువ ఉంటుందికాని, ఏదో ఒకటి గంటల తరబడి చెప్పుకుంటూ పోతే కొన్నిటిని అయినా నమ్మరా అన్న సిద్దాంతంతో పనిచేసేవారిని ఏమని అనగలం. టీడీపీ విడుదల చేసిన ఒక పుస్తకంలో ఏకంగా లక్షాపాతికవేల మంది ప్రభుత్వ వైఫల్యం కారణంగా మరణించారట. చంద్రబాబు ఏవో చెత్త అంకెలు చెబుతారని అందరికి తెలుసుకాని, మరీ ఇంత నీచంగా అబద్దాలు చెబుతారని ఊహించలేదు.
వందల మంది దళితులు, బలహీనవర్గాలవారి ప్రాణాలను ప్రభుత్వం తీసిందట. అసలు సమస్య ఏమిటంటే బడుగు, బలహీనవర్గాలు, పేదలు అత్యధికంగా జగన్ వెంట నడుస్తున్నారు. వారిని ఎలాగైనా జగన్ నుంచి దూరం చేయాలన్న లక్ష్యంతో ఇలాంటి పిచ్చి లెక్కలు చెబితే జనం అసహ్యించుకుంటారన్న భావన కూడా టీడీపీకి రాకపోవడం దురదృష్టకరం. తన పార్టీవారు ఏమి చేసినా ఎవరూ చర్య తీసుకోకూడదట. తన ప్రభుత్వంలో మంత్రులంతా సచ్చీలురట. వారు స్కామ్ లకు పాల్పడినా వదలివేయాల్సిందేనట. చివరికి అది పేపర్ లీకేజీ అయినా,మరొకటి అయినా టిడిపి వారి జోలికి వెళ్లకూడదట. ఇలా సాగుతోంది ఆయన ప్రసంగం.
కోనసీమలో క్రాప్ హాలిడే అని, ధాన్యం రైతులే కాదు, ఉద్యానవన రైతులు, ఆక్వా రైతులు ఇలా అన్ని రకాలవారు పంటలు వేయవద్దని అనుకుంటున్నారని చంద్రబాబు సెలవిచ్చారు. ఎన్ని వర్గాలు వారు వీలైతే అందరిని రెచ్చగొట్టడమే వీరి ధ్యేయం అన్నది అర్ధం అవుతూనే ఉంది. వాటికి జగన్ ఒక్క మాటలో జవాబిచ్చేశారు. అయినా చంద్రబాబు వాటిని పట్టించుకోరు. తాను చేయదలిచిన దూషణలు చేసుకుంటూనే పోతారు. అది పార్టీ సమావేశం అయినా, మహానాడు అయినా, మీడియా గోష్టి అయినా ఆయనకు పెద్దగా తేడా ఉండదు. తనకు అండగా ఉన్న మీడియాను అడ్డుపెట్టుకుని ఇలాంటివన్ని ప్రచారం చేస్తుంటారు. దీనివల్ల ప్రజలలో ఆయన పలచన అవడమే తప్ప పార్టీకి ఎంతవరకు ఉపయోగం అన్నది ప్రశ్నార్థకమే.
ఈ మధ్య మహానాడు గురించి టీడీపీ నేత ఒకరు ఒక విషయం చెప్పారు. చంద్రబాబు ఒక్కరే గంటల తరబడి ప్రసంగాలు చేస్తున్నారని, వేరేవారు ఎవరైనా మూడు నిమిషాలు మించి మాట్లాడితే మాత్రం వెంటనే ఏదో రకంగా ఆపుతుంటారని ఆయన అన్నారు. చివరికి అనేక తీర్మానాలపై జరిగిన చర్చలలో సైతం ప్రతి తీర్మానంపై చంద్రబాబే కనీసం 45 నిమిషాలకు తక్కువ కాకుండా మాట్లాడారని ఆయన వివరించారు.
దీంతో అది విని భరించడమే పెద్ద కష్టం అయిందని ఆయన వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గంటల తరబడి మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా, బలవంతంగా ఆయన పార్టీ కార్యకర్తలకు వినడమో, లేక విన్నట్లు నటించడమో తప్పడం లేదు. జగన్ ఈ విషయంలో చాలా బెటర్. తాను చెప్పదలచుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పి మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రసంగాన్ని ముగిస్తున్నారు. ఈ విషయంలో అధికారులుకాని, వైసీపీ కార్యకర్తలు కాని హ్యాపీ అని చెప్పాలి. ఈ రెండేళ్లు చంద్రబాబు నోటి నుంచి ఇంకా ఎలాంటి దుర్భాషలు వస్తాయో తెరపైన చూడాల్సిందే.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment