తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.
అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.
ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్‌మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.
గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు.
ప్రభుత్వ భవనాల మాటేమిటి?
మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన‍్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.
మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు.
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.
మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.
లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.
ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment