
ఏపీలో ఎలా విజయం సాధించాలో తెలియక తెలుగుదేశం పార్టీ అనేక తంటాలు పడుతోంది. తాజాగా తాను బీహారు డకాయిట్ అని విమర్శించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ ను తెచ్చుకుని సంప్రదింపులు జరిపిన తీరు చూస్తే, ఆ పార్టీ ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తానే పెద్ద వ్యూహకర్తనని భావించేవారు. ఆయన వ్యూహంతోనే తన మామ ఎన్ టి రామారావును పదవిచ్యుతుడిని చేశారని , ఆ తర్వాత 1999లో భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్లి విజయం సాధించారని టీడీపీ నేతలు చెబుతుండేవారు.
తదుపరి 2009లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తులోకి వెళ్లి సఫలం కాకపోయినా, 2014 నాటికి మళ్లీ నరేంద్ర మోదీతో ఎలాగొలా స్నేహం చేసి తిరిగి బీజేపీతో కూటమి కట్టుకుని, అలాగే పవన్ కళ్యాణ్‌ను తనదారిలోకి తెచ్చుకుని ,రైతు రుణమాఫీ హామీని ఇచ్చి మళ్లీ అధికారంలోకి రాగలిగారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.
✍️అప్పట్లో కేవలం ఎస్.వి.యూనివర్శిటీకి చెందిన ఒక ఫ్రొఫెసర్ నాయకత్వంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని సర్వేలు చేయించుకుని రాజకీయం చేసేవారు. మరి అప్పటి వ్యూహ నైపుణ్యత ఏమైందో? లేక ఆయన కుమారుడు లోకేష్ ఈయనను పాత చింతకాయ పచ్చడి కింద భావిస్తున్నారేమో తెలియదు కాని ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్ట్ లను పెట్టుకుని రాజకీయాలు నడుపుతున్నారు. వీరెవరూ చాలరని ప్రశాంత కిషోర్ ను లోకేష్ ప్రత్యేక విమానంలో ఎక్కించుకుని వచ్చారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆద్వర్యంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రశాంత కిషోర్ కీలకంగా ఉన్నారని భావిస్తారు. ఆ తర్వాత కాలంలో కిషోర్ ఈ వ్యాపకానికి దూరంగా బీహారు రాజకీయాలు చేసుకుంటున్నారు. అయినా అప్పుడప్పుడూ ఈ రంగంలోకి వస్తుండవచ్చు.
✍️కాని నలభైఐదేళ్ల సీనియర్ రాజకీయవేత్తగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వీరిపై ఆదారపడవలసి రావడంతో ఆయన లో వ్యూహరచన నైపుణ్యం తగ్గిందని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల నుంచే చంద్రబాబు ఏమని అనేవారు. తనను ఓడించినందుకు ప్రజలంతా బాదపడుతున్నారని చెబుతుండేవారు. కొందరు మహిళలను పెట్టుకుని వచ్చి వారంతా ఏడుస్తున్నట్లు కూడా డ్రామాలు ఆడించారు. అయినా జనం పెద్దగా పట్టించుకోలేదు. తదుపరి స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఆయన చెప్పే డాంబికాలను ప్రజలు నమ్మడం లేదని అర్ధం అయింది.ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రేమ లేఖలు పంపుతున్నట్లు మాట్లాడేవారు. బీజేపీతో పొత్తులో ఉన్న ఆయనను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. నిజానికి పవన్ ను చంద్రబాబే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్ డి ఏ లోకి పంపారని అంటారు.
✍️అది వేరే సంగతి. ఆ తర్వాత కాలంలో జనసేన, టీడీపీ కలుస్తాయని ప్రకటించగానే, ఇంకేముంది.. వైఎస్సార్‌సీపీ పని అయిపోయింది అని చంద్రబాబు ప్రచారం చేసేవారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటి మీడియా సైతం ఆహా, ఓహోఅంటూ ప్రచారం చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు ఉన్న జైలుకు వెళ్లి పరామర్శ చేసి , ఆ వెంటనే పొత్తు ప్రకటించారు. దాంతో ఏపీ ప్రజలంతా తమ కూటమివైపే ఉన్నారని చెప్పడం ఆరంభించారు. ఈలోగానే రాబిన్ శర్మ అనే వ్యూహకర్త సేవలను వాడుకున్నారు. అలాగే సునీల్ కనుగోలు వంటి మరికొందరితో కూడా సంప్రదింపులు జరుపుతూ ,కర్నాటక లో అమలు చేసిన గ్యారంటీ స్కీములను, అమ్మ ఒడి వంటి జగన్ స్కీములను కూడా కాపీ కొట్టి మినీ మానిఫెస్టోని ప్రకటించారు. దాంతో వైఎస్సార్‌సీపీ ఓడిపోతుందని బీరాలు పోయేవారు. ఇన్ని చేసిన సీనియర్ రాజకీయ నాయకుడు చివరికి ప్రశాంత కిషోర్ ను కూడా శరణు చొచ్చారు. అంటే ఏమిటి దీని అర్ధం.
✍️ తెలుగుదేశం ఇంతగా కృషి చేస్తున్నా బలపడడం లేదనే కదా! పవన్ కళ్యాణ్‌ను లొంగదీసుకున్నా ప్రయోజనం ఆశించిన రీతిలో రావడం లేదనే కదా! కమ్మ, కాపు సామాజికవర్గాల కాంబినేషన్ అని చెప్పుకున్నా, ఆయా వర్గాలు విశ్వసించడం లేదనే కదా! ఇప్పటికే ఇద్దరు వ్యూహకర్తలను కోట్ల రూపాయల వ్యయంతో నియమించుకున్నా ఫలితం రావడం లేదనే కదా! జనంలో మార్పు కనిపించడం లేదనే కదా! ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాదాకృష్ణ , టివి 5 నాయుడు వంటివారు అబద్దాలు ఊదరగొడుతున్నా జనం పట్టించుకోవడం లేదనే కదా! ప్రశాంత కిషోర్ ఉండవల్లిలో చంద్రబాబు తో భేటీ అయిన తర్వాత కేవలం సీనియర్ నేత కనుక మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. కాని ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు రోజూ చేసే ప్రసంగాలన్నిటిని ప్రశాంత్ కిషోర్ నోటిలో పెట్టి , అవన్ని ఆయనే అన్నట్లుగా రాసేశాయి. ప్రచారం చేసేశాయి.జగన్ ప్రభుత్వంపై ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుగుదేశం మీడియా చెబుతోంది.
✍️ ఇందులో నిజం ఉంటే కిషోర్ భేటీ తర్వాత బయటకు రాగానే చెప్పి ఉండాలి కదా! అలా ఏమీ చేయలేదంటేనే ఎల్లో మీడియా ఎప్పటి మాదిరి కల్పిత కధనాలను ఇచ్చిందని అర్దం చేసుకోవచ్చు. మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యాఖ్యచేశారు. మెటీరియల్ ఉంటేనే కదా మేస్రీ పనిచేయగలిగేది అని అన్నారు. అందులో వాస్తవం ఉంది. కేవలం వ్యూహకర్తల వల్లే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాదు. కాకపోతే ఆ పార్టీ విదానాలు , అధినేత తీరుతెన్నులు, ప్రజలలో విశ్వాసం కల్పించడానికి జరిగే కృషి మొదలైనవాటిపై ఆదారపడి ఫలితాలు వస్తుంటాయి. కాకపోతే అవన్ని సానుకూలంగా ఉంటే వ్యూహకర్తల ఐడియాలు కూడా కొంత పనిచేస్తాయి. ఇందులో నాయకుడి చిత్తశుద్ది కూడా ముఖ్యం. ఉదాహరణకు వైఎస్ జగన్ చెప్పాడంటే చేస్తారు అని అభిప్రాయం సర్వత్రా ఉంది.
✍️ దానికి కారణం ఆయన 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేశారు కనుక. ఆయన తీసుకు వచ్చిన సంస్కరణలు,చేస్తున్న అభివృద్ది, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ జరగని విదంగా చేస్తుండడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. అయినా ప్రభుత్వం అన్నాక కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. కాని ప్రభుత్వం చేసిన మంచి పనులతో పోల్చితే ఈ లోటుపాట్లు తక్కువగా ఉంటే జనం పెద్దగా పట్టించుకోరు. జగన్ కనుక తాను చెప్పిన హామీలను అమలు చేయకుండా ఉంటే ఈ పాటికి బదనాం అయి ఉండేవారు.ఏ వ్యూహకర్త ఏమి చేసినా ఇబ్బంది వచ్చేది. జగన్ అలాకాకుండా అన్నీ చేశారు కనుకే ఇంత బలంగా ఉన్నారు నుకోవాలి. ఈ నేపథ్యంలోనే లోకేష్ పనికట్టుకుని ప్రశాంత కిషోర్‌ను తీసుకు వచ్చారన్న అభిప్రాయం ఉంది.
✍️నిజంగా చంద్రబాబుకు ఇష్టమయ్యే ఇలా చేశారా? లేదా లోకేష్ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది తెలియదు .కాని జరిగిన హడావుడి చూస్తే ఇదంతా లోకేష్ చేసిన హడావుడినేనని భావిస్తున్నారు. అందువల్లే బహుశా పవన్ కళ్యాణ్ ను కూడా పిలవకుండా వీరు ముగ్గురే భేటీ అయి ఉంటారని భావిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇదే ప్రశాంత కిషోర్ ను బీహారు డెకాయిటీ అని, కుల చిచ్చు పెడతారని, బీహారు రాజకీయాలు ఇక్కడ నడవవని, ఇలా ఎన్నో రకాలుగా చంద్రబాబు దూషించారు.
✍️అయినా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో నేర్పరి అయిన చంద్రబాబు ఇప్పుడు అదే ప్రశాంత కిషోర్‌తో సిగ్గుపడకుండా మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఇది టీడీపీ బలహీనతను చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు రావడం ద్వారా తెలుగుదేశం, జనసేన కూటమికన్నా వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నది తెలిసిందని చెప్పవచ్చు. ఇది కూడా జగన్ కు ఒకరకంగా మంచిదే!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment