తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసానికి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వెళ్లి చర్చలు జరపడం బహుశా ఎన్నికల రాజకీయాలలో భాగమే అయి ఉంటుంది. రెండు నెలలపాటు పూర్తిగా సినిమా షూటింగ్ లలోనే ఉంటున్న పవన్ , ఈ భేటీ ద్వారా తాను యాక్టివ్ గానే ఉన్నట్లుగా సంకేతం ఇచ్చినట్లు అయింది. అంతేకాక చంద్రబాబుతో సంబంధాలు బాగానే ఉన్నాయని పార్టీ క్యాడర్ కు సందేశం ఇచ్చినట్లు అవుతుంది.అదే సమయంలో ఆయన టీడీపీతో రాజకీయ అక్రమ సంబంధం ఏర్పడిన విషయాన్ని ఎప్పటికప్పుడు నిర్దారిస్తున్నారు.
అక్రమ సంబంధం అని ఎందుకు అనవలసి వస్తున్నదంటే, దానికి కారణం ఉంది. జనసేన 2019 నుంచిబీజేపీతో పొత్తులో ఉంది. వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా అధికారికంగాని, అనధికారికంగా కాని ప్రకటన రాలేదు. బీజేపీ వారు తెలుగుదేశం పార్టీ పట్ల తమ వైఖరి మార్చుకోలేదు. టీడీపీని అవినీతి పార్టీగా, కుటుంబ పార్టీగా పదే, పదే ప్రకటిస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ వాటిని పట్టించుకోకుండా, ఎలాగొలా బీజేపీని కూడా టీడీపీ గూటిలోకి తీసుకు రావడానికి శతవిధాల యత్నిస్తున్నారు.
భవిష్యత్తులో ఏమి అవుతుందో కానిఇప్పటికైతే బీజేపీ ససేమిరా అంటున్నది. అందువల్లనే పవన్ కళ్యాణ్ నేరుగా టీడీపీతో పొత్తు గురించి ప్రకటన చేయలేకపోతున్నారు. అంతేకాదు. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ వెనుక ద్వారం నుంచి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భేటీ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని వారు అలా చేయలేదు. పైగా మీడియా కంటపడకుండా తప్పుకున్నారు. వారి రాజకీయ అక్రమ సంబంధం గురించి ఏమి చెప్పాలన్నదానిపై క్లారిటీ రాకపోవడం వల్లే ఇలా చేసి ఉండవచ్చన్నది ఒక భావన. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఈ భేటీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రాజకీయాలలో పొత్తులు మార్చుకోవడం కొత్త కాదు. కాని ఒక పార్టీతో కాపురం చేస్తూ , మరో పార్టీతో సంసారం చేయడం మాత్రం జనసేన ప్రత్యేకత అని చెప్పాలి. వీరిద్దరి కలయికకు ముందు ఇందుకు ప్రాతిపదికను కూడా పవన్ సిద్దం చేశారు. టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య వివాదాలు పెరగకూడదని ప్రకటన చేశారు. టీడీపీ చిన్న నేతలు ఎవరైనా జనసేనపై విమర్శలు చేసినా వాటిని వ్యక్తిగత విమర్శలుగానే చూడాలని పవన్ సూచించారు. అంటే ఇప్పటి నుంచే తగ్గి ఉండాలని జనసైనికులకు చెబుతున్నారన్నమాట. కాని జనసేనకు మద్దతు ఇచ్చే ఒక టీవీ చానల్ మాత్రం చాలా ఆశతో ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీలో పలు అంశాలపై క్లారిటీ వచ్చిందని, ఒక వేళ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నట్లు ఆ చానల్ ప్రచారం చేసింది.
అందులో నిజం ఎంత ఉందో తెలియదు. అది నిజం కాకపోతే జనసైనికులు అప్ సెట్ అవుతారని, పవన్ కళ్యాణ్‌కు పార్టీ క్యాడరే ఎదురు తిరుగుతుందని కూడా హెచ్చరించింది. మరో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే జనసేన కలవకపోతే టీడీపీకి నలభై సీట్లే వస్తాయని, లోకేష్ పాదయాత్రకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని కూడా ఆ టీవీలో చెప్పారు. జనసేన నాయకత్వం ఎవరైనా ఇలా ప్రచారం చేయమంటే చేశారో, లేక అత్యుత్సాహంతో చేశారో తెలియదు.
చదవండి: బాబూ.. ఐ లవ్యూ
ఇంతకుముందు రెండుసార్లు చంద్రబాబు, పవన్‌లు భేటీ అయినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అని, వేదిక అని ఏవేవో కధలు చెప్పారు. కాని వాటిలో ఏది జరగలేదు. పవన్ కళ్యాణ్ తన మానాన తాను షూటింగ్ లలో బిజీగా ఉంటే, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు తమ ప్రచారం తాము చేస్తున్నారు.అందులో దాదాపు ఎక్కడా పవన్ కళ్యాణ్ , జనసేనల ప్రస్తావన లేకుండానే ఉపన్యాసాలు చేస్తూ పోతున్నారు. ఇక ఎన్.టి.ఆర్.శత జయంతి పేరుతో విజయవాడకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను తీసుకు వచ్చి చంద్రబాబు పొగిడించుకున్నారు. రజనీకాంత్ కు ప్రధాని మోడీతో సంబంధాలు ఉన్నాయి. ఆ లింక్ ను చంద్రబాబు వాడుకునే యత్నం చేస్తున్నారన్న సందేహం రాజకీయవర్గాలలో లేకపోలేదు.ప్రధాని మోడీని గతంలో తీవ్రంగా దూషించినా, చంద్రబాబు ఇప్పుడు పొగడడం ఆరంభించారు.
అయినా వారు ఇంకా ప్రసన్నం కాలేదు. పవన్ కళ్యాణ్ ను రాయబారం పంపించినా బీజేపీవారి వద్ద పప్పులు ఉడకలేదు. ఈ నేపధ్యంలోనే కింకర్తవ్యం గురించి వారిద్దరూ చర్చించి ఉండవచ్చు. బీజేపీని ముగ్గులోకి లాగడం ఎలా అన్నది వారి ఎజెండాలలో ఒకటి కావచ్చు . ఒకవేళ బీజేపీ ఒప్పుకోకపోతే, ఆ పార్టీని జనసేన వదలిపెట్టడం ఎలా? ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఎలా? తదుపరి సీట్ల సర్దుబాటు, సీఎం పదవి షేరింగ్ మొదలైన అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు.
అంతేకాకుండా, ఈనాడు అధినేత రామోజీరావును మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసు నుంచి ఎలా బయటవేయడం అన్నదానిపై కూడా వారి మధ్య సంప్రదింపులు జరిగితే జరిగి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే తెలుగుదేశం మీడియా చంద్రబాబు, పవన్ల భేటీకి సంబంధించి ఎలాంటి కూపీ లాగకుండా జాగ్రత్తపడ్డాయి. అంతర్గతంగా చర్చల సారాంశం బయటపెట్టకుండా పాత సోదికే పరిమితం అయ్యాయి. అది కూడా గమనించవలసిన అంశమే. ముఖ్యమంత్రి జగన్‌ను ఒంటరిగా పోటీచేసి ఓడించలేమన్న భయంతో ఉన్న చంద్రబాబు నాయుడు జనసేనను ఆకర్షించే పనిలో ఉన్నారు. తమకు అండగా ఉంటారన్న నమ్మకంతో బలం లేకపోయినాబీజేపీతో జతకట్టాలని తంటాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు తన రాజకీయ ఆటలో అరటి పండులా వాడుకుంటున్నారా!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment