ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఒక కొత్త డ్రామాకు తెరతీస్తుంటారు. ఈ విసయంలో ఆయన తెలివితేటలను మెచ్చుకోవలసిందే.తనను తాను ఒక అపర మేదావిగాను, అపారమైన జ్ఞాన సంపన్నుడుగాను ,మొత్తం దేశం అంతా తన వంకే చూస్తున్నదన్న చందంగా ప్రొజెక్టు చేసుకోవడంలో దిట్ట అని చెప్పాలి. ఆయనకు ఈనాడు, ఆంద్రజ్యోతి ,టివి 5 వంటి మీడియా సంస్థలు జాకీలేసో, కర్రలు కట్టో విపరీతంగా లేపుతుంటాయి. తాజాగా ఆయన విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్ ను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
బాబుగారి విజన్‌తో భారత్ విశ్వగురు అయిపోతుందట..!
తెలుగుదేశం వారు ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను ఈ మీడియా యధాతధంగా వాడి ఆహో, ఓహో అంటూ భజన చేశాయి. అందులో లీడ్ లో ఏమి రాశారో చూడండి.చంద్రబాబు గతంలో అద్భుతంగా విజన్ 2020 అమలు చేసేశారట. ఆ తర్వాత 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజన్ 2029 పేరుతో అమోఘంగా పనిచేశారట. రాష్ట్రాన్ని అబివృద్ది చేసేవారట. వార్త ఇవ్వడం తప్పు కాదు. మరీ జనాన్ని వెర్రివాళ్లను చేయాలన్న తాపత్రయంతో అతిశయోక్తులు రాయడమే బాగోలేదు.
ఒక పక్క చంద్రబాబు ఇంటర్‌లో బైపీసీ చదివి ఇంజనీరింగ్ చదవాలని చెబుతారు. వర్క్ ఫ్రమ్ హోం పోలీసులకు అమలు చేస్తామని అంటారు. ఐటీ వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ను తెచ్చి ఒక్కొక్కరికి పది లక్షల రరూపాయల చొప్పున ఇంటిలో కూర్చుని సంపాదించుకోవచ్చని ఉపన్యాసం ఇస్తున్నారు.సెల్ ఫోన్ టార్చిలైట్ తానే కనిపెట్టానంటారు.. ఇవన్ని వింటే ఏమనుకోవాలి. వీరు చెబుతున్న అంత తెలివైన చంద్రబాబుకు ఏమైందా అన్న సందేహం రాదా? చంద్రబాబు విజన్‌తో భారత్ విశ్వ గురు అయిపోతుందని ఈనాడు పెద్ద హెడింగ్ పెడుతుంది.
మీ విజన్‌తో మోదీని చాలెంజ్ చేయొచ్చు కదా..!
మరి అది నిజమే అయితే ఈ విజన్ ను తీసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి చాలెంజ్ విసరవచ్చు కదా! మీకు దేశాన్ని అభివృద్ది చేయడం చేతకావడం లేదు. మీరు అసమర్దులు.దేశాన్ని నాశనం చేస్తున్నారు.. అని చెప్పి తన విజన్ విజ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు కదా! ఎందుకంటే మోదీని ఎటూ 2019 కి మందు చాతకాని వాడిగానే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కదా?పేరుకేమో బారత్ విజన్. ఆలోచన ,మాటలు అన్ని ఏపీ ప్రభుత్వంపై. ముఖ్యమంత్రి జగన్ ను దూషించడానికి. ఈ విజన్ లో ఆయన మళ్లీ జన్మభూమి కాన్సెప్ట్ తెస్తారట.
అంటే ప్రజలంతా ఏభై శాతం చెల్లిస్తేనే అబివీద్ది పనులు చేపట్టడం అన్నమాట. తప్పు లేదు. అందులో చిత్తశుద్ది ఉంటే అదే చెప్పవచ్చు. కాని ప్రజలు వాడి పడేసే చెత్తను కలెక్ట్ చేసి తరలించడానికి వంద రూపాయల చొప్పున వినియోగ చార్జీ కలెక్ట్ చేయాలని కేంద్రం సూచనల మేరకు రాష్ట్రం అమలు చేస్తే ఏమన్నారు.. చెత్త పన్ను వేసే చెత్త ప్రభుత్వం అని చంద్రబాబు అన్నారు. వంద రూపాయలకు చెత్త ప్రభుత్వం అయిపోతే, ఈయన చెప్పినట్లు ఏభైశాతం వ్యయం ప్రజలు భరించాలన్న స్కీమ్ అమలుచేస్తే ఎంత చండాలపు ప్రభుత్వం అవుతుంది. ఇది ఒకటే కాదు. ప్రతిదానిపై ఏపీ ప్రభుత్వాన్ని , జగన్ ను అనరాని మాటలు అంటారు. గతంలో కాలనీలలో చిన్న రోడ్లు వేసుకోవాలన్నా జన్మభూమి కింద ఏభై శాతం కట్టవలసి వచ్చేది. అది లక్షకాని , పది లక్షలు కాని. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ స్కీమ్ తీసేసి మొత్తం ప్రభుత్వమే వ్యయం చేసేలా పనులు చేపట్టారు. 2000 సంవత్‌సరం ప్రాంతంలో విజన్ 2020 అని ఊదరగొట్టేవారు. మన దేశానికి పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి.
అప్పుడు మీ విజన్‌కు 23 సీట్లే వచ్చాయి..
ఏదైనా ఒక ప్రధాన లక్ష్యంతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండేది. ఉదాహరణకు అందరికి విద్య 2000 నాటికి ఇవ్వాలని, అందరికి ఆరోగ్యం ఫలానా సంవత్సరానికి ఇవ్వాలని పెట్టుకున్నారు. కాని అవేవి ఆచరణలో అమలు కాలేకపోయాయి. అది వేరే సంగతి. చంద్రబాబు గారి విజన్ 2020 కి ఆకాశమే హద్దుగా తోచినట్లు రాసేసుకున్నారు. దానిని తయారు చేసే అదికారులు చంద్రబాబు వద్ద సమావేశం పూర్తి కాగానే బయటకు వచ్చి నవ్వుకునేవారు. అయనలో ఉన్న అసలు ఉద్దేశం ప్రజలను మభ్య పెట్టడం అని తెలుసుకుని అసహననానికి గురి అయ్యేవారు. ఉదాహరణకు ఒక ఏడాదిలో లక్ష యూనిట్ల పంపిణీ సాద్యమని అధికారులు రాసకు వెళితే దానిని పది లక్షలు అని రాయమనేవారట. అదేమిటని అంటే అలా రాయాలి. ప్రజలను మాయ చేయడానికి అన్నట్లు చెప్పేవారట. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. ఒకసారి స్వీడన్ నుంచి అనుకుంటా ఒక మంత్రి వచ్చారు. ఆయన వద్ద చంద్రబాబు తన పాండిత్యాన్ని అంతటి ప్రదర్శించి విజన్ 2020 వంటి పలు అంశాలు ప్రస్తావించారు. అది విన్న ఆ స్వీడన్ మంత్రి తమ దేశంలో ఇలా చెప్పేవారిని అయితే మెంటల్ ఆస్పత్రిలో పెడతారు..లేదా జైలులో వేస్తారని అన్నారని అప్ప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ తరవాత ఆ మంత్రిని బతిమలాడుకుని ఏదో వివరణ ఇప్పించుకున్నట్లున్నారు. అలాగే ఇప్పుడు 2047 విజన్ అంటూ కొత్త నాటకానికి తెరదీశారు. చంద్రబాబు గతంలో విజన్ 2020 అని ప్రచారం చేసిన తర్వాత 2004 లో ఓటమిపాలై 47 సీట్లకే పరిమితం అయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2029 నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా ఏపీని చేస్తానని, 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్ ఒన్ స్థానం ఏపీకి వస్తుందని ..ఇలా ఏవేవో చెబుతుండేవారు. ఇదంతా హంబగ్ అని ప్రజలు భావించి 2019 లో ఘోరంగా ఓడించి 23 సీట్లకే పరిమితం చేశారు. అయినా మళ్లీ కొత్తగా విజన్ అంటూ బయల్దేరారు. మరి దీనికి ముందు మిని మానిఫెస్టో అని ప్రకటించిన దాని గురించి ఏమి చెబుతారు? జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన వివిద సంక్షేమ కార్యక్రమాఇలతో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయిందని ప్రచారం చేసే చంద్రబాబు ఇప్పుడు జగన్ చేసినదానికన్నా ఐదు రెట్లు ఎలా అమలు చేస్తానని అంటున్నారు?జగన్ ఏడాది 45 వేల కోట్లు వివిధ కార్యక్రమాలకు వ్యయం చేస్తే నాశనం అంటున్న చంద్రబాబు , అలాగే పవన్ కళ్యాణ్ లు తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ అమలు చేస్తామని అంటున్నారు.
అప్పుడు మీరు ఏ విజన్ అని చెబుతారు బాబు?
చంద్రబాబు ప్రకటించిన మిని మానిఫెస్టో నిజంగా అమలు చేస్తే ఏడాదికి సుమారు రెండు లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ చేయాలి. అప్పుడు ఏపీ ఎన్ని శ్రీలంకలు అవుతుంది. దీనిని చంద్రబాబు ఏ విజన్ అని చెబుతారు?అయితే ప్రజలను మోసం చేయడానికి అయినా కావాలి...లేదా నిజంగానే ఏపీని దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్లడానికి సిద్దపడైనా అవ్వాలి. చంద్రబాబు తన కొత్త విజన్ పుస్తకంలో దీని గురించి చెప్పారో,లేదో తెలియదు.విజన్ డాక్యుమెంట్ వేరు..ఎన్నికల మానిఫెస్టోలు వేరా? 2014లో ఎన్నికల మానిఫెస్టోలో వందల కొద్ది హామీలు ఇచ్చి ఎలా ప్రజలను మోసం చేసింది , వెబ్ సైట్ నుంచి దానిని తొలగించింది మర్చిపోయామా? అది ఏ రకమైన విజన్ అని అనుకోవాలి. చిత్రం ఏమిటంటే 2019 లో మానిఫెస్టోను ప్రకటించి అమలు చేసిన జగనేమో రాష్ట్రాన్ని నాశనం చేసినట్లట.
పచ్చి అద్దాలతో మానిఫెస్టో తయారు చేసి ప్రజలను మోసం చేస్తేనేమో రాష్ట్రాన్ని బాగు చేసినట్లట. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ది ఉంటే తాను గత మహానాడులో ప్రకటించిన మినీ మానిఫెస్టోని విజన్ డాక్యుమెంట్లో పెట్టి దానికి అయ్యే వ్యయం ,ఇతర అంచనాలు, అందుకు సమకూరే వనరులు మొదలైనవాటిని వివరించాలి. అలా చంద్రబాబు చేయగలరా? అందుకకే చంద్రబాబు ఎన్నికల టైమ్ లో ప్రతి ఒక్కరికి కిలో బంగారం ఇస్తానని, బెంజ్ కారు ఇస్తానని వాగ్దానం ఇస్తారని జగన్ ఎద్దేవా చేస్తుంటారు. మరో విషయం ప్రస్తావించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ఎక్కడ లేని దేశ భక్తి గుర్తుకు వస్తుంటుంది.అప్పట్లో అన్నాహజారే ఉద్యమం నడిచేది. అవినీతికి వ్యతిరేకంగా ఆయన లోక్ పాల్ వ్యవస్థ తేవాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. ఆ టైమ్ లో చంద్రబాబు తాను కూడా నీతిమంతుడనే అని చెప్పుకోవడానికి హైదరాబాద్‌లోలో జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ తీస్తే అంతా నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా విశాఖపట్నంలో అలాగే జాతీయ జెండాతో ర్యాలీ తీశారు.ఇలాంటి జిమ్మిక్కులకు ప్రజలు పడిపోయే రోజులా ఇవి? అయినా చంద్రబాబు తన మానిప్యులేషన్ స్కిల్ ను ప్రయోగించడానికి ఎప్పుడూ ముందుంటారు.కాకపోతే ఆయనకు ఈ మద్య మానసిక సమతుల్యత కాస్త దెబ్బతిని కొన్ని అసంబద్ద డైలాగులు చెబుతుండడంతో నవ్వుల పాలవుతున్నారు.
--కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment