బాబు 'బాదరాయణ బంధాన్ని' కొల్లగొట్టిన ఆపరేషన్.. 'గరుడ' | KSR Comments On Chandrababu Over Drugs Case | Sakshi
Sakshi News home page

బాబు 'బాదరాయణ బంధాన్ని' కొల్లగొట్టిన ఆపరేషన్.. 'గరుడ'

Published Mon, Mar 25 2024 12:29 PM | Last Updated on Mon, Mar 25 2024 1:25 PM

Ksr Comments On Chandrababu Drugs Case - Sakshi

రాజకీయాలలో ఒక ధీరి ఉంటుంది. తాము ఏ తప్పు అయినా చేయదలిస్తే, లేదా తప్పు చేస్తే, ముందుగా దానిని ఎదుటివారిపై నెట్టేయడం. ఎదుటివారేదో ఘోరం చేస్తున్నారని ప్రచారం చేసి, చల్లగా తన పనికానీచ్చుకోవడం. తాను దొంగతనం చేసి దొరికిపోతున్నామని అనుకుంటే ‘కావు, కావు’ మని.. వైరి పక్షంపై ఆరోపణలు గుప్పించడం. ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలలో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాత ఈ ధోరణితోనే ఆయన కథ నడిపించారు. దానికి ఈనాడు రామోజీరావు వంటివారు బాకా ఊదుతూ తానా అంటే తందానా అనేలా రెడీగా ఉంటారు. దాంతో ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోయింది. కానీ అన్నిసార్లు ఇది సాద్యపడదు కదా! అందులోను సోషల్ మీడియా విస్తారంగా వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ఎన్ని పన్నినా ఇట్టే దొరికిపోతున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా ఇలాగే తయారయ్యారు.

విశాఖపట్నంలోని పోర్టుకు బ్రెజిల్ నుంచి మాదకద్రవ్యాలతో కూడిన కంటైనర్ వచ్చిన ఉదంతంలో టీడీపీకి బూమ్ రాంగ్ అయిందని చెప్పాలి. ఇలాంటి డ్రగ్స్ విషయాలలో రాజకీయాలకు అతీతంగా అంతా ప్రవర్తించాలి. కానీ పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబే ఎదుటివారి మీద బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలని చూడడం ద్వారా మొత్తం సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ముందుగానే అసలు వాస్తవం తెలిసి ఉండాలన్న భావన కలుగుతుంది. తమ పార్టీకి చెందినవారే ఈ కేసులో దొరికిపోయేలా ఉన్నారని అర్దం అయి ఉండాలి. తమకు సంబంధించిన వారి బంధువులు పట్టుబడుతున్నారని కనిపెట్టి ఉండాలి.



అందుకే విశాఖలో ఒక పక్క సీబీఐ సోదాలు జరిపి పరిశోధన చేస్తుంటే..

  • లోకేష్ దీనిపై ట్వీట్ చేస్తూ వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు గుప్పించారు.
  • చంద్రబాబు నాయుడు సైతం విశాఖ డ్రగ్స్ కాపిటల్ అయిపోయిందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
  • వైఎస్సార్‌సీపీ నేతలు అసలు విషయం తెలుసుకుని ఖండన ఇచ్చేలోగానే వీరు తమ భజంత్రీలైన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి గ్రూపు మీడియా సంస్థల ద్వారా వారి ట్వీట్లలో పేర్కొన్న అంశాలను ప్రచారంలో పెట్టేశారు.

పైగా పత్రికలలో ఏమి రాశారు. సీబీఐ డ్రగ్స్‌ను వెలికి తీసి పరిశీలిస్తుంటే, స్థానిక పోలీసులు ఆటంకం సృష్టించే యత్నం చేశారని కూడా వీరు తేల్చేశారు. కానీ వీరు ఎక్కడా అది ఫలానా వారి కంపెనీ ఇది అని, వారి చిరునామా ఇది అని, వారికి ఫలానా వారితో సంబంధాలు ఉన్నాయని రాయకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వైఎస్సార్‌సీపీ పెద్దలే డ్రగ్స్ తెప్పించారన్నంత నీచంగా కూడా టీడీపీ ప్రచారానికి దిగింది.



దాంతో వైఎస్సార్‌సీపీ మేలుకుని మొత్తం విషయం రాబట్టి ఆశ్చర్యపోవలసి వచ్చింది. 'సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు చెందిందని వెల్లడైంది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబానికి వీరికి సంబంధాలు ఉన్నాయని, పలువురు టీడీపీ నేతలతో వీరికి బాదరాయణ బంధం ఉందని' వైఎస్సార్‌సీపీ నేతలు చిట్టా విప్పారు. దాంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. డ్రగ్స్ వంటి సమస్యలను రాజకీయ కోణంలో చూడకూడదు. సమాజానికి ఇది పెనుభూతం వంటిది. సీబీఐ వారు ఇంటర్ పోల్ సాయంతో ఇంత పెద్ద డ్రగ్ రాకెట్‌ను ఆపరేషన్ గరుడ పేరుతో కనిపెట్టినందుకు వారిని అభినందించాలి. బ్రెజిల్ నుంచి వచ్చినవి డ్రగ్స్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత సీబీఐ కంపెనీని యజమానులను, ఆ కంపెనీ అధికారులను అదుపులోకి తీసుకోవచ్చు. లేదా అదుపులోకి తీసుకోకుండానే విచారణ జరపవచ్చు.

మొత్తం మీద  డ్రగ్స్ మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయో, ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ సరఫరాకు ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం సీబీఐ చేస్తుంది. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో టీడీపీ అధికంగా కంగారు పడుతోంది. 'ఈ కంపెనీ తమ సామాజికవర్గం వారిది కావడం, కంపెనీ యజమానులలో కొందరికి గత చరిత్ర అంత క్లీన్‌గా లేకపోవడం వల్ల ఆ బురద అంతా తమపై వచ్చి పడుతుందేమోనన్న కంగారులో చంద్రబాబు, లోకేష్‌లు తొందరపడి పిచ్చి ట్వీట్‌లు చేసి వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు గుప్పించారు'. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకు వేసి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి లింక్ పెట్టి ట్వీట్ చేశారు. అంతిమంగా అదేదో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు సంబంధించిందేమో అన్న చందంగా అనుమానం క్రియేట్ చేయడానికి యత్నించారు.

ఇక  రామోజీరావు రంగంలో దిగి డ్రగ్స్ తెప్పించారన్న అభియోగాలను ఎదుర్కుంటున్న వారిని రక్షించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా ఉంది. శనివారం నాటి పత్రికలో అంతా అనుమానాస్పదమే అన్న శీర్షికతో ఒక ప్రధాన కథనాన్ని వండి వార్చారు. అందులో ఎంత సేపు సీబీఐ డ్రగ్స్ గురించి దర్యాప్తు చేస్తుంటే, దానిని ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారని దుర్మార్గపు ప్రచారం చేసింది. పోలీసులు అలా చేశారంటే వైఎస్సార్‌సీపీ పెద్దల పాత్ర లేకుండా ఉంటుందా అని దిక్కుమాలిన రాతలు రాసింది. అసలు రాయవలసింది ఏమిటి..?

  • ఆ కంపెనీ ఎవరిది?
  • గతంలో కూడా ఇలా చెప్పిన సరుకు కాకుండా వేరే డ్రగ్స్ లేదా ఇతర అభ్యంతరకర పదార్దాలు ఏవైనా తీసుకువచ్చేవారా?
  • ఆ కంపెనీ ముఖ్యుల మూలాలు ఏమిటి?
  • వారు ఎలా ఆ స్థాయికి వచ్చి ఆక్వా కంపెనీ పెట్టారు?
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీపై ఎప్పుడైనా ఏదైనా కేసు పెట్టిందా?

మొదలైన అంశాలపై వార్తలు రాయకుండా రామోజీ ఎంతసేపు సీబీఐ అధికారులను ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారన్నదానిని ఫోకస్ చేయడానికి యత్నించింది. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్..

  • ఎక్కడా ఎవరూ ఆటంకం కలిగించలేదని,
  • సీబీఐ కోరితేనే డాగ్ స్క్వాడ్ పంపించామని,
  • ఈ ప్రక్రియలో కొంత జాప్యం అయిందని.. సీబీఐ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారని,
  • సీబీఐ అధికారులను కూడా  మీడియా సమాచారం కోరవచ్చని..

స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈనాడు మీడియా ఈ రకమైన దుర్మార్గపు ప్రచారం చేసిందంటే వారి దుష్ట ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పోనీ ఏపీ పోలీసులు కావాలని జాప్యం చేశారని అనుకుందాం. దానివల్ల  వారికి వచ్చే లాభం ఏమిటి? అయినా సీబీఐ తన పని తాను చేసుకుపోయింది కదా? ఆ విషయం రాయకుండా, ఆ స్కామ్ మూలలు తవ్వకుండా ఈనాడు మీడియా అబద్దపు కథనాలు ఇస్తోందంటే వారు ఎంత నీచంగా మారారో అర్ధం చేసుకోవచ్చు.

ఈ కథనంలో ఎక్కడా ఆ కంపెనీకి సంబంధించిన 'వీరభధ్రరావు, కోటయ్య చౌదరి' తదితరుల గురించి ఒక్క ముక్క రాసినట్లు కనిపించలేదు. పైగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో వీరభద్రరావు సోదరుడు పూర్ణచంద్రరావు దిగిన ఫోటోను ప్రముఖంగా ప్రచురించింది. తీరా చూస్తే ఆయన తన సోదరుడి వ్యాపారాలతో తనకు సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, స్థానిక రాజకీయాలలో వైఎస్సార్‌సీపీని అభిమానిస్తానని చెప్పారు. విశేషం ఏమిటంటే అసలు ఆ కంపెనీతోకానీ, ఆ డ్రగ్స్‌తో కానీ ఏ మాత్రం సంబందం లేని పూర్ణచంద్రరావు ఫోటో వేసిన టీడీపీ మీడియా అసలు కంపెనీ నడిపే వారి పోటోలు వేయలేదు. వారి వివరాలు ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్‌సీపీవారు ఏకంగా చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధించినవారే ఈ డ్రగ్స్ స్కామ్ లో ఉన్నారని ఆరోపిస్తూ సీఈఓ కి ఫిర్యాదు చేసింది. చిత్రం ఏమిటంటే.. "ప్రతి చిన్న విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బురద చల్లుడు తప్ప ఫిర్యాదు చేయలేదు." దీనిని బట్టి టీడీపీకి సంబంధించినవారి బండారం బటపడుతుందని ఈ డ్రామా ఆడారని అనుకోవాలి.

ఈ పరిణామాల నేపథ‍్యంలోనే  ఈనాడు రామోజీరావు  ఈ ఘటనపై రాస్తున్న కథనాల వెనుక కులభావన, విశాఖపై ద్వేష భావన వెదచల్లడం, టీడీపీ దొరికిపోకుండా కాపాడడం, ఒకవేళ నిందితులు తనకు తెలిసినవారైతే వారిని రక్షించడం.. లక్ష్యాలతో ఈ వార్తలు ఇచ్చినట్లు అభిప్రాయం కలుగుతుంది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినప్పటి నుంచి ఆ నగరంపై ఈనాడు రామోజీరావు విషం చిమ్ముతూనే ఉన్నారు. అలాగే కమ్మ కులంలో ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెనుకేసుకు వస్తున్నారన్న దరిద్రపు ఆరోపణకు కూడా ఆయన ఆస్కారం ఇవ్వడం దురదీష్టకరం.

ఈ మద్యకాలంలో హైదరాబాద్‌లో పట్టుబడినన్ని డ్రగ్స్ మరే నగరంలోను దొరకలేదు. అయినా ఈనాడు మీడియా మాత్రం ఎక్కడా వాటికి ఎక్కువ ప్రచారం ఇవ్వదు. పైగా గతంలో బీఆర్‌ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు వత్తాసు పలకడానికి పోటీ పడుతోంది. గుజరాత్‌లోని ముంద్ర పోర్టు ద్వారా దేశంలోకి వచ్చినన్ని డ్రగ్స్ మరెక్కడ బహిర్గతం కాలేదు. గుజరాత్‌లో డ్రగ్స్ సమస్యపైకానీ, పంజాబ్‌కు పాకిస్తాన్ నుంచి వచ్చే మత్తు పదార్దాల గురించికానీ ఎన్నడూ బీజేపీ తదితర పార్టీలపై వార్తలు రాయని ఈనాడు మీడియా ఏపీపై మాత్రం నీచంగా రాస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి యత్నిస్తోంది.

తంలో చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో చేసిన స్కామ్‌లను సమర్థించే దుస్థితిలో రామోజీరావు ఉన్నారు. సింగపూర్‌కు చెందిన మాజీ మంత్రి ఈశ్వరన్‌ను ఏపీకి తీసుకు వచ్చి వేల కోట్ల భూములను కట్టబెట్టిన చంద్రబాబును ఎన్నడూ తప్పు పట్టలేదు. ఇప్పుడు అదే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి మంత్రి పదవి కోల్పోయారు. అయినా ఒక్క ముక్క రాయదు. అమరావతిలోనే ఏదో ఆస్పత్రి పెడతారంటూ వంద ఎకరాల భూమి పొందిన బీడీ శెట్టి అనే వ్యాపారిని దుబాయిలో అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరికి, చంద్రబాబుకు ఉన్న సంబంధ బాంధవ్యాలేమిటో ఒక్క అక్షరం కూడా రాయని దౌర‍్భాగ్య స్థితిలో ఈనాడు మీడియా ఉంది. అంతెందుకు చంద్రబాబుపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, దుబాయిలో ఆయన అక్రమంగా డబ్బు పొందారని ఆరోపణలు రావడం వంటివాటిపై పరిశోధన కథనాలు రాయకపోగా, ఆయనను సమర్దిస్తూ వార్తలు ఇస్తుంటారు. ఇదంతా ఈనాడు రామోజీ స్వార్ధ వ్యాపార ప్రయోజనాలకే అన్న సంగతి అందరికి తెలిసిపోయింది.

ఇంకో సంగతి కూడా చెప్పాలి. 'ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ అరెస్టు అయ్యారు. అప్పట్లో వీరిద్దరిపైన వెంటాడుతూ వార్తలు రాసిన ఈనాడు, ప్రస్తుతం వారిద్దరూ తెలుగుదేశంలో చేరగానే తేలుకుట్టిన దొంగలాగా నోరు మూసుకుని కూర్చుంది.' అంటే దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. తనకు నచ్చకపోయినా, తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నారనుకున్న వారిపై ఉన్నవి, లేనివి అభూతకల్పనలు రాసి బ్లాక్ మెయిల్ చేయడం, వారిలో ఎవరైనా లొంగిపోతే రామోజీ కామ్ అయిపోవడం జరుగుతుందని అనిపించడం లేదా! చివరికి రామోజీ కులతత్వవాదిగా మిగిలిపోయి అప్రతిష్టపాలవుతరని నేనైతే గతంలో ఎన్నడూ ఊహించలేదు. ఏం చేస్తాం.. రామోజీ లాంటి వారు ఈ వయసులో తమ ప్రతిష్ట పెంచుకోకపోగా, ఇలా దిగజారుతున్నారంటే వారికి ఏదో భయం పట్టుకున్నదన్నమాటే కదా!


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement