సాక్షి, హైదరాబాద్: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న చీప్ జిమ్మిక్కు. ప్రజల అటెన్షన్‌ను పక్కదారి పట్టించే కుట్ర. గతంలోనూ ఈ తరహా జిమ్మిక్కులు చూశాం. గతంలో మోదీ ఇచ్చిన హామీలేవీ నెరవేరనందునే బీజేపీ ఇలాంటి అంశాలను తెరమీదకు తెస్తోంది. త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తున్నందున తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఇప్పట్లో జరగకుండా ఆపే కుట్ర జరుగుతోంది.
ఆయా రాష్ట్రాల్లో ఓటమి పాలైతే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయంతో ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికల పేరిట ప్రజల దృష్టిని మళ్లించడంలో బీజేపీ కొంతమేర సక్సెస్ అయ్యింది..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు.
ఆ శక్తి ఎవరికీ లేదు: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ఆపే శక్తి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సహా ఎవరికీ లేదు. మోదీ లాంటి వ్యక్తి ఏదో ఎజెండా లేకుండా దీనిని తెరమీదకు తెస్తారని అనుకోవడం లేదు. 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున ఈ విధానాన్ని అమలు చేస్తారనే అనుమానం ఉంది. అయితే ఈ నెల 18న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఏం జరుగుతుందో మోదీ, అమిత్ షా మినహా ఎవరికీ తెలియదు.
రామ మందిరం ప్రారంభం తర్వాతే మోదీ ఎన్నికలకు వెళితే ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా ఎన్నికలు జరిగే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సెపరేట్‌గా పోలింగ్ నిర్వహించే ఉద్దేశం మోదీకి లేదు. ఎలాగైనా ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఎత్తగొట్టాలనే జమిలి ఎన్నికలను తెరమీదకు తెస్తున్నారు.
అయితే దీనికి అనుసరించే విధానం ఏంటి? పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేసి ఐదు రాష్ట్రాల ప్రస్తుత అసెంబ్లీ గడువు పెంచుతారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? వంటి అంశాలపై స్పష్టత లేదు. రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మోదీ ఒక్కరోజు కూడా అధికారం వదులుకునే రకం కాదు కాబట్టి మమ్మల్ని కూడా అటు వైపు గుంజుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మామూలుగా అయితే వచ్చే నెల 5 లేదా 10 తేదీ లోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావాలి..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ, మహారాష్ట్రలోనే పోటీ
‘పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చే అంశాలను చూసిన తర్వాతే బీఆర్‌ఎస్ వైఖరి వెల్లడిస్తాం. అయితే జమిలి ఎన్నికలు వచ్చినా మాకు ఎలాంటి నష్టం లేదు. ఈసారి తెలంగాణ ప్రజలు అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా అనుకూల తీర్పును ఇస్తారు. జమిలి ఎన్నికలు వస్తే మోదీ, షా దేశమంతటా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మేము తెలంగాణ, మహారాష్ట్రలోనే పోటీ చేస్తాం.
ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే ‘పాలమూరు– రంగారెడ్డి’, ‘సీతారామ’ వంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటాం. పార్టీలో అంతర్గత అంశాలు సరి చేసుకోవడానికి మాకు మరింత సమయం దొరుకుతుంది. అయితే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ వంటి ఒకటి రెండు రాష్ట్రాల కోసం ఎన్నికలు వాయిదా వేసి మోదీ బదనాం అవుతాడని అనుకోవడం లేదు..’ అని మంత్రి అన్నారు.
90కి పైగా సీట్లలో బీఆర్‌ఎస్ గెలుపు
‘కమ్యూనిస్టుల ఐడియాలజీ, విచ్ఛిన్నకర శక్తుల పట్ల వారి వైఖరి, భావ సారూప్యతతో మాకు ఏకీభావం ఉంది. కానీ సీట్ల లెక్కలు కుదరకపోవడంతోనే వారితో పొత్తు సాధ్యం కాలేదు. మాకు 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో వారు అడిగిన సీట్లు ఇవ్వడం సాధ్యం కాలేదు. 115 మంది అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించడంతో విపక్షాలు కకావికలం అయ్యాయి. కేసీఆర్‌ను ఎదుర్కోవడంలో గందరగోళంలో పడ్డాయి.
మరోవైపు బీఆర్‌ఎస్‌లో టికెట్ రాని వారు తమ పార్టీల్లోకి వస్తారనే కాంగ్రెస్, బీజేపీల ఆశలు అడియాశలయ్యాయి. సర్వేలు, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 90కి పైగా సీట్లలో బీఆర్‌ఎస్ గెలుస్తుంది. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారు. మేము 99 శాతం టికెట్లు ప్రకటించాం. ప్రతిపక్షాలు అప్లికేషన్లు అమ్ముకుంటూ రేపు టికెట్లు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాయి..’ అని ఆరోపించారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు
‘మేము బీజేపీతో కుమ్మక్కయ్యామనడం అర్ధరహితం. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. కేసీఆర్‌తో సరిపోయే నాయకులెవరూ తెలంగాణలో లేరు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో రాజకీయ అస్థిరత లేదు. మా సీఎం అభ్యర్థి కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీల సీఎం అభ్యర్థులెవరో చెప్పగలరా? ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు కావాలా.. ప్రజా నాయకుడు కేసీఆర్ కావాలో ప్రజలే తేలుస్తారు..’ అని కేటీఆర్ అన్నారు. జీ 20 సమావేశాలకంటే టీ 20 మ్యాచ్‌లపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపారని, రొటేషన్‌లో వచ్చిన అవకాశానికి బాకా కొట్టుకునే ప్రయత్నం బెడిసి కొట్టిందని విమర్శించారు.
ఆంధ్ర పరిణామాలపై ఆసక్తి లేదు
‘ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మేమెందుకు కామెంట్ చేయాలి. ఆంధ్రా రాజకీయాలు, అక్కడి పరిణామాలతో మాకు సంబంధం లేదు. వాటిపై మాకు ఆసక్తి లేదు. అది వారి తలనొప్పి. ఏపీ పరిస్థితులు, కేసు పూర్వాపరాలు తెలియకుండా తీర్పులు ఇవ్వలేం. మేం తెలంగాణ పాలనపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాం. మాకు ఇక్కడ ఇతర తలనొప్పులు ఉన్నాయి. ఇక్కడ యూ ట్యూబ్ చానెళ్లు పెట్టి సీఎంను రోజూ తిడుతున్నారు. రన్నింగ్ కామెంటరీ చేయడం జాతీయ పార్టీ పనికాదు. జాతీయ అంశాలపై మాట్లాడాలి..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
జమిలి.. చీప్ జిమ్మిక్కు
Published Wed, Sep 13 2023 1:31 AM | Last Updated on Wed, Sep 13 2023 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment