సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారత్ రాష్ట్ర సమితిలో చేరేందుకు అంగీకరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆదివారం ఉదయం జరిగే భేటీ తర్వాత పొన్నాల తన నిర్ణయాన్ని ప్రకటించను న్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ నేతలతో కలిసి శనివారం పొన్నాల నివాసానికి వెళ్లారు.
పొన్నాల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని, బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభ వేదికపైపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ సీఎంతో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల సమాధానం ఇచ్చారు.
సీనియర్లను రేవంత్ అవమానించారు: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించినట్టు ఆయనతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులకు తెలిపారు. ఆయన పార్టీలోకి వస్తే కె.కేశవరావు, డి.శ్రీనివాస్ తరహాలో సరైన స్థానం కల్పించి గౌరవిస్తామన్నారు. పీవీ నర్సింహారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులను రేవంత్‌రెడ్డి అవమానించారని విమర్శించారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి.. ఇతరులు తమకు గౌరవం దక్కక పార్టీ బయటకు వెళ్తుంటే తప్పు పడుతు న్నారని విమర్శించారు. చచ్చే ముందు పార్టీ మారటం ఏమిటని కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు: పొన్నాల
రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి తాము పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ ఎమ్మెల్యేగా ఓడి పోయారు. ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహి స్తున్న మల్కాజిగిరి పరిధిలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలవలేదు. 2014, 2018లో పొన్నాల లక్ష్మయ్య ఒక్కడే ఓడిపోయాడా? జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఓడిపోలేదా?..’ అని పొన్నాల ప్రశ్నించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, దాసోజు శ్రవణ్, రాజారాం యాదవ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment