
కుప్పం మండలం వేపూరు మిట్టపల్లెకు చెందిన ఖాదర్‌బాషా మాజీ సర్పంచ్. టీడీపీ గ్రామస్థాయి నాయకుడు. నిన్నటి వరకు ఆ పార్టీకి వీరాభిమాని. ఇతనికి ముగ్గురు కుమారులు. ఖాదర్‌బాషాతో పాటు కుమారులు యాసిన్, ముస్తఫా, ముబారక్ రైతు భరోసా కింద లబ్ధి పొందారు. యాసిన్ కుమార్తెకు అమ్మ ఒడి కింద మంజూరైంది. ఖాదర్‌బాషా భార్య ముబీనాకు జగనన్న చేయూత కింద ఆర్థిక సాయం అందింది. వారి కుటుబాల్లోని మహిళలు డ్వాక్రా గ్రూపులో ఉన్నారు. వారు గతంలో తీసుకున్న రుణానికి చెల్లించిన వడ్డీ మొత్తం రూ.26వేలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరిగి చెల్లించింది. దీంతో ఖాదర్ బాషా కుటుంబం మొత్తం జగన్‌కు జై కొడుతోంది.
సాక్షి, తిరుపతి :ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ మంత్రానికి చంద్రబాబు కోట బీటలు వారుతోంది. కుప్పంలో టీడీపీ నిలువునా చీలిపోతోంది. అపర చాణక్యుడిగా చెప్పుకునే ఆ పార్టీ అధినేతకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోంది. చంద్రబాబు హయాంలో అందని సాయం జగన్ ప్రభుత్వంలో అందడంపై తమ్ముళ్లలో ఆనందం వ్యక్తమవుతోంది. కార్యకర్తల్లో అనూహ్య మార్పును గుర్తించిన స్థానిక టీడీపీ నేతలు రాజీనామా బాట పట్టడంతో జిల్లా నాయకత్వం డైలమాలో పడింది. భవిష్యత్‌లో ఇక్కడ గెలుపు అంత సులువు కాదనే విషయం అధ్యక్షుడికి చేరవేసింది.
ఖాదర్‌బాషా కుటుంబం ఒక్కటే కాదు.. కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ క్రమం తప్పకుండా అందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకు తప్ప వేరొకరికి సంక్షేమ పథకాలు అందేవి కావు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా పాలన సాగుతోంది. టీడీపీ కంచుకోట కుప్పం నిలువునా చీలుతోంది. ఈ క్రమంలోనే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరుతానని ప్రకటించారు. ఆయనతో పాటు మరి కొందరు టీడీపీ నాయకులు సైతం సైకిల్ దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుప్పం అర్బన్ టీడీపీ అధ్యక్షుడు విద్యాసాగర్ చంద్రబాబుకు ఎప్పుడో గుడ్‌బై చెప్పేశారు.
ముఖం చాటేస్తున్న తమ్ముళ్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు వరుసకడుతున్నారు. ఇప్పటికే వందల మంది గ్రామస్థాయి నాయకులు టీడీపీ రాం రాం చెప్పేశారు. దీంతో పలువురు ముఖ్యనాయకులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సాక్షాత్తు చంద్రబాబు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడం లేదని విశ్వసనీయ సమాచారం.
ఏం జరుగుతోంది?
కుప్పంలో ఏం జరుగుతోంది? నాకు వెంటనే తెలియాలి? అని టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా నాయకులను అడిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు ఒకరు “సాక్షి’కి చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతో కుప్పానికి చేరుకున్న కొందరు జిల్లా స్థాయి నాయకులకు టీడీపీ శ్రేణులు ముఖం చాటేసినట్లు సమాచారం. కార్యకర్తల్లో వచ్చిన అనూహ్య మార్పును గమనించిన జిల్లా నాయకులు కూడా డైలమాలో పడ్డారు. మొత్తం పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.