కుప్పం చెప్పింది.. బై బై బాబూ! | Chandrababu was severely defeated in his own constituency Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పం చెప్పింది.. బై బై బాబూ!

Published Thu, Nov 18 2021 3:16 AM | Last Updated on Thu, Nov 18 2021 7:11 AM

Chandrababu was severely defeated in his own constituency Kuppam - Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, తిరుపతి: దన బలం, దౌర్జన్యాలు, అక్రమ ఓటర్లతో ముప్పై ఏళ్లకు పైగా కుప్పాన్ని గుప్పిట్లో పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి అక్కడి ప్రజలు బై బై చెప్పారు. మూడు దశాబ్దాల అనైతిక రాజకీయాలపై తిరుగుబాటు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ఓటేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి చంద్రబాబు కంచుకోటకు ఇటీవలి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనే బీటలు వారగా, సోమవారం జరిగిన కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో ఆ కోట బద్దలైపోయింది.  2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళిపై 30,722 ఓట్ల ఆధిక్యంతో చంద్రబాబు విజయం సాధించారు.

స్థానిక సంస్థలు, మునిసిపాలిటీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీపై వైఎస్సార్‌సీపీ 64,851 ఓట్ల ఆధిక్యాన్ని సాధించడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే.. రెండున్నరేళ్లలోనే చంద్రబాబుకు.. కుప్పం ప్రజలు బై బై చెప్పేసినట్లు స్పష్టమవుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీని ప్రజలు ఆదరిస్తున్న తరహాలోనే కుప్పం ప్రజలు కూడా అక్కున చేర్చుకున్నారు. కుప్పం మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన అనంతరం తొలిసారిగా జరిగిన  ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకు గాను.. ఒక వార్డులో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవమైంది. మిగిలిన 24 వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగాయి. బుధవారం నిర్వహించిన కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ 18 వార్డులను కైవసం చేసుకోగా, టీడీపీ  6 వార్డులే గెలిచింది.

వలస వచ్చి.. దౌర్జన్యంగా గెలుస్తున్న బాబు 
వాస్తవంగా చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె. అది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. 1983 ఎన్నికల్లో తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఘోరపరాజయం పాలయ్యారు. దీంతో తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఎన్‌టీ రామారావు నటించిన సినిమాలను అత్యంత ఎక్కువగా ఆదరించే కుప్పం నియోజకవర్గానికి ఆయన వలస వెళ్లారు. తనకు అనుకూలురైన ఇతర ప్రాంతాల ప్రజలను కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా ఓటర్లుగా చేర్పించారు. రౌడీ మూకలతో అలజడి సృష్టించి.. పోలింగ్‌కు ప్రజలు రాకుండా అడ్డుకుని.. ధనాన్ని వెదజల్లడం, ఓట్లను సైక్లింగ్‌ చేసుకోవడం వంటి అనైతిక చర్యలతో  1989 ఎన్నికల్లో కుప్పంలో తొలిసారిగా విజయం సాధించారు. ఆ తర్వాత కూడా ఇవే విధానాల్ని మరింత వాడిగా ప్రయోగిస్తూ 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. 2014లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో 18 వేల అక్రమ ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది.

ఇప్పటికీ పది వేలకు పైగా అక్రమ ఓటర్లు కుప్పం నియోజకవర్గంలో ఉన్నట్లు అంచనా. అయితే, ఈసారి కుప్పం ప్రజలు చంద్రబాబు దౌర్జన్యాలకు, అనైతిక రాజకీయాలకు చరమగీతం పాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలనకు పట్టం కట్టారు. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే టీడీపీ అధినేతకు షాక్‌ తగిలింది. ఓ రకంగా చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఆయన గెలుపొందారు. వరుసగా ఆరుసార్లు గెలిపించిన కుప్పంలో 2019 ఎన్నికల్లో రెండు రౌండ్లలో వెనకబడ్డారు. ఆ తర్వాతి రౌండ్లలో మెజార్టీ రావడంతో ఎలాగోలా బయటపడ్డారు. ఆ తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దారుణ పరాజయమే మిగిలింది. కుప్పం మునిసిపాలిటీలోనూ ఘోర పరాజయంతో చంద్రగిరిని వీడిన తరహాలోనే.. ఇప్పుడు కుప్పంను వీడి మరో నియోజకవర్గానికి చంద్రబాబు వలస వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఒంగి ఒంగి దండాలు పెట్టినా బాబును ఛీకొట్టిన కుప్పం
30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ, పధ్నాలుగేళ్ల పాటు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ఆ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఎప్పటికీ మారుమూల పంచాయతీగానే ఉంచాలని భావించారు. తన ‘వర్గ’ ప్రయోజనాలు తప్పించి ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే కుప్పంకు మునిసిపాలిటీ హోదా ఇచ్చారు. రోడ్లు, మంచినీటి పైపుల ఏర్పాటు వంటి కనీస మౌలిక సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇటీవలి పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తుడిచి పెట్టుకుపోగా వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. అయితే ఆ ఎన్నికలకు తాము దూరంగా ఉన్నామని బీరాలు పలికిన చంద్రబాబు.. గెలిచిన ముగ్గురు ఎంపీటీసీలకు మాత్రం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన చంద్రబాబు.. నోటిఫికేషన్‌కు నాలుగు రోజుల ముందు కుప్పంలో పర్యటించారు. ఎప్పుడూ లేని విధంగా ఒంగి ఒంగి దండాలు పెట్టారు. అర్ధరాత్రి వరకూ మారుమూల వీధులు కూడా కలియతిరిగారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తాను బహిష్కరించానని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి పరువు నిలబెట్టాలని అభ్యర్ధించారు. చంద్రబాబు ఎంతగా ఒంగి ఒంగి దండాలు పెట్టినా, టక్కుటమార విద్యలు ఇకపై చెల్లవంటూ వైఎస్సార్‌సీపీకి ఘనమైన విజయాన్ని అందించారు. కుప్పం ఎప్పుడొచ్చినా బాబు స్థానిక ప్రజలనుద్దేశించి మీ రుణం తీర్చుకోలేనంటూ సినిమాటిక్‌ డైలాగులు  చెబుతుంటారు. అభివృద్ధి మాత్రం చేయరు. తాజా ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు కుప్పంతో రుణం తీరినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికల ముందు నుంచే బాబు హైడ్రామా 
నోటిఫికేషన్‌కు ముందు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అక్కడ హైడ్రామా సృష్టించారు. ఆయన మీటింగ్‌ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వద్ద బాంబు ఉందంటూ ఆ పార్టీ శ్రేణులు అతన్ని చితకబాదారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలే తనపై బాంబు వేసేందుకు పంపించారంటూ బహిరంగ సమావేశంలో చంద్రబాబు ఊగిపోయారు. చివరకు అతను ఉద్యోగి అని, పైగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని తెలిసి నోరెత్తలేకపోయారు. మూడు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ నాయకులపై పెద్ద ఎత్తున విషప్రచారం చేశారు.

ఆ తరువాత నారా లోకేశ్‌ని ప్రచారానికి పంపారు. రెండు రోజుల పాటు లోకేశ్‌ నోటికి అడ్డూ అదుపు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలీసుల పట్ల సైతం అవమానకరంగా మాట్లాడారు. కుప్పం చంద్రబాబు అడ్డా.. ఇక్కడ ఎవ్వరూ ఏం పీకలేరంటూ అసభ్యంగా మాట్లాడారు. అయినా ఓడిపోతామని తెలియడంతో దొంగ ఓట్లకు, దౌర్జన్యాలకు దిగారు. స్థానికేతరులను కుప్పంలో దింపి దొంగ ఓట్లు వేయించేందుకు యత్నించారు. ఆ అవకాశం లేకపోవటంతో... టీడీపీ శ్రేణులను పోలింగ్‌ బూత్‌లోకి పంపించి వైఎస్సార్‌సీపీ దొంగ ఓటర్లంటూ నానా హంగామా చేయించారు.

దొంగ ఓటర్లంటూ బస్టాండులో ప్రయాణికులపై దాడులు చేశారు. పోలింగ్‌కు ముందూ.. స్థానికేతరులైన మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులను కుప్పానికి రప్పించారు. వారిని పోలీసులు నియోజకవర్గం నుంచి బయటకు పంపడాన్ని తప్పుబడుతూ రోడ్లపై బైఠాయించి ప్రయాణికులను అడ్డుకుని రచ్చ రచ్చ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement