
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. ఈ నెల 14న పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ఆదేశించారు. ప్రచార తీరుతెన్నులు, క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోగతం, పార్టీ ఎన్నికల వ్యూహం అమలు తదితరాలకు సంబంధించి కేటీఆర్ శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకనేతలకు ఫోన్ చేసి మాట్లాడారు.
రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు విస్తరించి ఉన్న ఆరు ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జులుగా వ్యవహరించిన మంత్రుల ద్వారా ప్రచార తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇతర కేటగిరీల పట్టభద్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల 85శాతానికి పైగా పట్టభద్ర ఓటర్లను నేరుగా కలుసుకోవడం సాధ్యమైందని పార్టీ నేతలు కేటీఆర్‌కు వివరించారు. ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించడంతోపాటు సుమారు 20 రోజులుగా వారిని సమన్వయం చేశామని వెల్లడించారు.
ఓటేసేందుకు వచ్చేలా చూడండి
ప్రచారం సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రస్తావించిన అంశాలపై ఓటర్ల స్పందనను తెలుసుకున్న కేటీఆర్.. పోలింగ్ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ పరంగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సానుకూల ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా క్షేత్రస్థాయి సమన్వయకర్తలు పనిచేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment