ఈ రెండ్రోజుల సమావేశాల్లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున పోటీచేసే ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను శని, ఆదివారం జరిగిన సమావేశాల్లో సిద్ధంచేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ జిల్లాల వారీగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, కన్వినర్లు, ఇతర ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
శనివారం 14 లోక్‌సభ స్థానాల పరిధిలో జిల్లా నాయకుల సమావేశాలు జరగ్గా.. ఆదివారం మిగిలిన 11 లోక్‌సభ స్థానాల సమావేశాలు జరిగాయి. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాలకు సంబంధించి ఆయా జిల్లాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాం. నియోజకవర్గాల వారీగా సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం.
ఈ జాబితాలను జాతీయ నాయకత్వానికి పంపుతాం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసేందుకు రెండు వేలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండ్రోజుల సమావేశాల్లో అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. నిబంధనల ప్రకారం.. మేం ఇచ్చే జాబితాపై పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చ జరుగుతుంది. అప్పుడు కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకులను పిలిచి అభ్యర్థుల తుది ఎంపికపై చర్చిస్తుంది.
పొత్తుపై చర్చ జరగలేదు..
ఈ సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం అభ్యర్థుల ఎంపికకు సంబంధించే జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకున్నాం. పొత్తులపై జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ జాతీయ పార్టీ పొత్తులపై నిర్ణయం తీసుకునే పక్షంలో ఆ నిర్ణయాలకు అనుకూలంగా మేం మరోసారి సమీక్ష చేసుకుంటాం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment