ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది : మల్లాది | Malladi Vishnu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది : మల్లాది

Published Sun, Sep 29 2024 7:04 PM | Last Updated on Sun, Sep 29 2024 7:26 PM

 Malladi Vishnu Fires On Chandrababu

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద బురద జల్లాలని చూస్తే.. ఆ బురద మీ మీదే పడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.  

రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసింది. రాజకీయ దుర్భుద్ధితో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది. నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడొచ్చాయి. ఎప్పుడు తిప్పి పంపించారో డేటాతో సహా చెప్పాం. ఈవో ఒకలా, చంద్రబాబు మరోలా మాట్లాడుతున్నారు.

ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు రౌడీల్లా మారారు. పోలీసులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే వారిపైనే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.  

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ ప్రాంతాన్ని దోచుకుతింటున్నారు. సొంత పార్టీ వాళ్లే టీడీపీ ఆఫీస్‌కు వెళ్లి కొలికపూడిపై ఫిర్యాదు చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడిపై దాడి చేసి బూతులు తిట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు..ప్రజలకు సమాధానం ఏం చెబుతారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ బ్యానర్‌ను చించేసి అవమానించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన దగ్గర ఓ రెడ్ బుక్ ఉందని బెదిరిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను గెలిపించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు.  

వరద బాధితులకు సాయం చేయాల్సింది పోయి వారినే బెదిరిస్తున్నారు. వరద బాధితులపై లాఠీఛార్జి చేయడమేంటి. సాయం అడిగినందుకు చెట్టుకు కట్టేసి కొట్టడమేంటి. విజయవాడ మునిగిపోతే నిర్లక్ష్యంగా ఎన్యుమరేషన్ చేశారు. ఎన్యుమరేషన్ సరిగా చేయాలని మేం స్వయంగా కలెక్టర్‌ను కలిసి కోరాం. కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు.

లడ్డూ వివాదంపై సిట్ వల్ల ఏం ఉపయోగం. సిట్ చంద్రబాబుకు బీ టీమ్ వంటిది. మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నించి...ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడింది.రాజకీయాల కోసమే లడ్డూ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లడ్డూ వివాదం పై సీబీఐ విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు పై మాకు అచెంచలమైన విశ్వాసం ఉంది. మా హయాంలో ఏ తప్పూ జరగలేదని..మేం గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నాం. వైఎస్‌ జగన్‌ మీద బురద జల్లాలని చూస్తే..ఆ బురద మీపైనే పడింది. వైఎస్‌ జగన్‌ జగన్ ఐదేళ్లలో హిందూత్వాన్ని కాపాడారని గుర్తు చేశారు. 

కూటమి వందరోజుల పాలనలో అరాచకం..రౌడీయిజం.. ఘోరాలకు అడ్డేలేకుండా పోయింది. రౌడీ ఎమ్మెల్యేల అరాచకాలపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 

👉 చదవండి :  చంద్రబాబు ఓ పొలిటికల్‌ జాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement