
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారమే టీడీపీ నేతలు తొలుత ఎంపీ అవినాష్‌రెడ్డి పైన, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైన నిందలు మోపుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో టీడీపీ, ఎల్లో మీడియా ఒక పథకం ప్రకారం రోజుకోరకంగా కథనం రచించి, రోజుకో టీడీపీ నాయకుడితో మాట్లాడిస్తున్నాయని అన్నారు. ఈ కేసులో బీటెక్ రవి, రాజశేఖర్, టీడీపీ ప్రోద్బలంతో బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డిపై ఎందుకు నిందలు మోపడంలేదని ప్రశ్నించారు.
రాజకీయాల్లో సొంత బావను, మేనల్లుడిని, తోడల్లుడిని, తమ్ముడిని అందరినీ వాడుకుని వదిలేసింది చంద్రబాబేనని అన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ఆయన్ని వదిలిపెట్టే వారు కాదని అన్నారు. చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని, వంగవీటి రంగా, పింగళి దశరథరామ్ ఉదంతాలను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ అవసరాలకు వాడుకుని కరివేపాకులా పక్కన పడేశారన్నారు. ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై పడ్డారని దుయ్యబట్టారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైఎస్సార్‌సీపీకి మైలేజ్ వస్తుందన్న కక్షతోనే ఇలాంటి నిందలు వేస్తున్నారని అన్నారు. ఒంటరిగా ఢిల్లీ కోటలు బద్దలుకొట్టిన సీఎం జగన్‌ను అంగుళం కూడా కదిలించలేరని చెప్పారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.