YS Viveka Assassination Case: YSRCP MP Avinash Reddy Comments On CBI - Sakshi
Sakshi News home page

Viveka Assassination Case: వివేకాది ఆస్తి కోసం జరిగిన హత్య

Published Fri, Mar 10 2023 3:51 PM | Last Updated on Sat, Mar 11 2023 7:07 AM

Viveka Assassination Case: Mp Avinash Reddy Comments On Cbi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ వివేకానందరెడ్డిది మర్డర్‌ ఫర్‌ గెయిన్‌ (ఆస్తి, సొమ్ము కోసం జరిగిన హత్య) అని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ తప్పుదోవలో వెళ్తోందని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని, అది గూగుల్‌ టేకౌట్‌ కాదు టీడీపీ టేకౌట్‌ అని అన్నారు. తప్పుడు సాక్ష్యాలతో అన్యాయంగా అమాయకులను ఇరికించేలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దర్యాప్తులో చాలా కీలక అంశాలను పక్కన పెట్టి, సిల్లీ అంశాలను తెరపైకి తెచ్చి తనకు అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. సీబీఐ విచారణకు మూడోసారి శుక్రవారం హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

వివేకాకు రెండో పెళ్లి.. వారికి ఓ కుమారుడు.. 
♦  వివేకం సార్‌కు 2006 నుంచి ఒక యువతితో సంబంధం ఉంది. 2011లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. దానికి ఇస్లాం లా ప్రకారం తన పేరు షేక్‌ మహ్మద్‌ అక్బర్‌గా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత వారికి షేక్‌ షెహన్‌షా అనే అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయినే వారసుడిగా ప్రకటించాలనే తపన, ఆలోచన ఆయనలో ఉండింది. 

♦  హత్య జరగడానికి ముందు ఇల్లంతా డాక్యుమెంట్ల కోసం వెతికారని అప్రూవర్‌ స్టేట్‌మెంట్‌లోనే ఉంది. హత్య తర్వాత కూడా డాక్యుమెంట్లు వెరిఫై చేసుకుని వెళ్లారని చెప్పారు. నా అనుమానం ఏమిటంటే.. నోటరైజ్డ్‌ విల్లు అది. ఆమె (వివేకా రెండో భార్య) పేరుతోనో, వారి అబ్బాయి పేరుతోనో ఆస్తిని ఇవ్వాలనుకోవడం.. దీన్ని అడ్డుకోవాలనుకోవడం.. ఇందులో ఆసక్తి ఎవరికి ఉందో తెలియాలి.  

♦  నా అనుమానం ప్రకారం ఇది మర్డర్‌ ఫర్‌ గెయిన్‌. అందులో భాగంగానే వాళ్లు వివేకానంద రెడ్డి గారిని ఇలా చేశారు. రాబోయే రోజుల్లోనూ న్యాయ పోరాటం చేస్తా. 

ఆ లేఖ ఎందుకు దాచారు? 
♦  నేను గాలి మాటలు మాట్లాడట్లేదు. సొంత కవిత్వాలు చెప్పట్లేదు. రికార్డుల్లో ఉన్నవి, వాటి ద్వారా తెలిసినవే మాట్లాడుతున్నా. నేను వెళ్లే లోపలే సీన్‌ ఆఫ్‌ క్రైమ్‌లో ఉన్న లేఖను సునీతమ్మ భర్త రాజశేఖర్‌ దాచి పెట్టారు. పీఏ కృష్ణారెడ్డికి ఆ లెటర్‌ విషయం కానీ, అందులో ఉన్న అంశాలు కానీ ఎవరికీ చెప్పద్దని చెప్పారు. దీంతో పాటు సెల్‌ఫోన్‌ను దాచిపెట్టడం తప్పు కాదా?    

♦  నన్ను వెళ్లమని చెప్తేనే అక్కడకు వెళ్లాను. లెటర్‌ ఉన్న విషయం నాకు కూడా చెప్పలేదు. ఆ లెటర్‌ చాలా కీలక ఆధారం. సరైన సమయానికి దాని విషయం బయటకు చెప్పకపోవడం ఈ కేసులో పెద్ద తప్పు.   

♦  నేను ఏ ఒక్కరికీ గుండెపోటని (వివేకా మరణానికి కారణం) చెప్పలేదు. కావాలంటే ఆ రోజు మార్చురీ దగ్గర, మార్చ్‌ 17న మాట్లాడిన మాటలు చూడండి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నేను అలా చెప్పినట్లు చిత్రీకరించింది.  

♦  నేను చూసి బయటకు వచ్చి పోలీసులు, కుటుంబీకులు, దగ్గర బంధువులకు ఫోన్‌ చేసి విషయం చెప్పా. ఇవన్నీ చేయకుంటే తప్పంటారనుకున్నా. చేస్తే తప్పంటారని ఊహించలేదు.   

ముమ్మాటికీ అది కట్టుకథే 
♦  అప్రూవర్‌ థీయరీనే ఓ కట్టుకథ. ప్రారంభంలోనే గొడవ ప్రస్తావన. రూ.8 కోట్ల డబ్బు రావాల్సి ఉందో, వచ్చిందో వాటి గురించి గొడవ మొదలైందని చెప్తారు. ఆ షేర్ల పంపకం మీద వివేకం సారేమో మొత్తం నాకే కావాలని అన్నట్లు, వీళ్లేమో నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటా అన్నట్లు గొడవ మొదలై ఉండొచ్చంటారు. 

♦  ఇదే సీబీఐ విచారణలో ఆ బెంగళూరు సెటిల్‌మెంట్‌కు సంబంధించి ఎనిమిది మంది సాక్షులు (ఎల్‌డబ్ల్యూ 10 నుంచి మొదలై) చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సెటిల్‌మెంట్‌ ఫెయిల్‌ అయింది.. ఒక్క రూపాయి డబ్బు కూడా వచ్చే అవకాశం లేదు.. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఫోర్జరీ అని చెప్తారు. అంటే రాని, వచ్చే అవకాశమే లేని డబ్బు కోసం ఎవరైనా గొడవ పెట్టుకుని కొట్టి చంపుకుంటారా? ఇది కట్టు కథ అనడానికి ఇది చాలదా? 

 ఇది కుమ్మక్కు కాదా? 
♦  సుప్రీంకోర్టులో మా సోదరి (సునీత) వైల్డ్‌ అలిగేషన్స్‌తో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను సమర్థిస్తూ సీబీఐ వాళ్లు కౌంటర్‌ అఫిడవిట్‌ వేస్తారు. గురువారం లంచ్‌ మోషన్‌ మూవ్‌ చేస్తూ రెస్పాండెంట్స్‌గా సీబీఐ డైరెక్టర్, దర్యాప్తు అధికారిని పెట్టాం. మధ్యాహ్నం 2 గంటల కల్లా సీబీఐ వారి కంటే ముందు మా సోదరి తరఫు అడ్వకేట్లు వచ్చారు. అంటే వారికి ఎవరు సమాచారం ఇచ్చారు? 

♦  సీబీఐ వాళ్లకు నోటీసు వచ్చిన వెంటనే చిటికలో సమాచారం ఇస్తున్నారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కుమ్మక్కై పిటిషనర్‌కు అనుకూలంగా కౌంటర్‌ వేసి కోర్టులను తప్పుదోవ పట్టించారు. లంచ్‌ మోషన్‌లోనూ ఆమెకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్‌ చేయిస్తున్నారు. ఇది కుమ్మక్కు కాదా? దీని వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ రాజకీయ కుట్రలను తప్పకుండా చేదిస్తాం. న్యాయ పోరాటం చేస్తాం. కంచే చేను మేస్తే.. సీబీఐ ఈ రకంగా కుమ్మక్కై విచారణ చేస్తే మాకు ఎవరు దిక్కు?. 

అందుకే నోరు విప్పాల్సి వస్తోంది.. 
♦ కేవలం కుట్రలకు ఉపయోగపడే వాంగ్మూలాలు తప్ప నిజాలను వెల్లడించే వాంగ్మూలాలు తీసుకోవట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు ఇవ్వలేదని ప్రచారం చేశారు. అభియోగాలు మోపారు. దాదాపు 800 పైచిలుకు ఎమ్మెల్సీ ఓటర్లు.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఉన్నారు. వారిని పిలిచి అడగండి. అదీ చేయరు. అప్రూవర్‌ థియరీ.. కట్టుకథను అడ్డం పెట్టుకుని విచారణను ఓ వ్యక్తి టార్గెట్‌గా ముందుకు తీసుకువెళ్తున్నారు.  

♦ దీన్ని ఎవరూ హర్షించరు. దీంతో గళమెత్తడం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో నాపై ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగానే ఉన్నా. ఎందుకంటే వివేకం సార్‌ చనిపోయారు.. ఈమె ఆయన కూతురు అని.. విచారణ జరుగుతున్నప్పుడు విచారణ సంస్థపై నమ్మకం ఉండాలని మౌనంగా ఉన్నాను. అయితే విచారణ తప్పుడుదోవలో వెళ్తోందని స్పష్టం కావడంతో నోరు విప్పుతున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదని ప్రతి ఒక్కరికీ గట్టిగా చెబుతున్నా.  

చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?

తప్పుదోవలో విచారణ
ఉదయం 10.40–10.45 గంటల మధ్య ఇక్కడికి వచ్చాను. 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారించారు. ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని దర్యాప్తు అధికారి వెళ్లారు. అయినప్పటికీ 3.30 గంటల వరకు అక్కడే కూర్చోమన్నారు. ఆపై సీబీఐ వాళ్లు వచ్చి మీరు వెళ్లండి.. మళ్లీ మేము పిలిచినప్పుడు రండని చెప్పారు. 

విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్‌ కావాలని దర్యాప్తు అధికారిని మొదటి నుంచీ అడుగుతూనే ఉన్నాం. రెండోసారి ఇదే అంశాన్ని సీబీఐ డైరెక్టర్‌నే అడిగాం. ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో మూడోసారి హైకోర్టును ఆశ్రయించాం. విచారణ తప్పుదోవలో వెళ్తుండటంతో ఇలా చేయక తప్పలేదు. 

ఎంపీ టిక్కెట్టే ఈ హత్యకు కారణం అంటే మా జిల్లా వాళ్లు నవ్వుతారు. వివేకం సర్‌ చనిపోయే రోజు కూడా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో దాదాపు 300 ఇళ్లు డోర్‌ టు డోర్‌ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామిరెడ్డికి.. ఎంపీ అభ్యర్థిగా అవినాశ్‌కు ఓటెయ్యండని ప్రచారం చేశారు. కావాలంటే ఆ ఇళ్లకు వెళ్లి అడగచ్చు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని అడగచ్చు.. వాంగ్మూలం తీసుకోవచ్చు. కానీ వీళ్లు (సీబీఐ) అలా అడగరు. వాంగ్మూలం తీసుకోరు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement