పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా ఉండకూడదని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలని.. తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీగా కోరుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయమై తాము ఇవాళ (28వ తేదీన) కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవనున్నామని చెప్పారు.
బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పథకం ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు చేర్పిచిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రాలేమన్న బలమైన అభిప్రాయంతో చంద్రబాబు ఇలా చేశారని విమర్శించారు.
దీనికి పూర్తి భిన్నంగా రాష్ట్రంలో అసలు దొంగ ఓట్లే ఉండకూడదనే సదుద్దేశంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో ప్రతిపక్ష నేతల కూసాలు కదలిపోతున్నాయని, అందుకే చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాజాగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రేలాపనలే ఇందుకు నిదర్శనమని అన్నారు.
దొంగ ఓట్లతోనే కుప్పంలో బాబు గెలుపు
చంద్రబాబు ఇప్పటి వరకు దొంగ ఓట్లతోనే కుప్పంలో గెలుపొందుతూ వచ్చారని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయని చెప్పారు.
ఈసారి కుప్పంలో చంద్రబాబుకు కూడా ఓటమి తప్పదన్నారు. నాలుగేళ్లలో సంక్షేమాభివృద్ధి నేరుగా దళితుల ఇంటి తలుపులు తడుతోందని స్పష్టం చేశారు. దళిత సంక్షేమంపై తాము చర్చకు సిద్ధం అని చెప్పారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కుప్పంలోనే కుప్పకూలిపోయిన వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. 2024 ఎన్నికల్లో సైతం 2019 ఫలితాలే పునరావృతం అవుతాయని, టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment