సాక్షి, న్యూఢిల్లీ : బెంగాల్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించు కొనేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన వ్యూహా లకు పదును పెడుతు న్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీ మరోసారి బెంగాల్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 25 తేదీన కోల్‌కతాకు చేరుకున్న తర్వాత ముస్లింల ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న మాటియాబుర్జ్ ప్రాంతంలో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా, పాదయాత్ర చేయాలనే యోచనలోనూ ఉన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే అంశంపై ఒవైసీ చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఒవైసీ బెంగాల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఎంఐఎం చేరికపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ ఏడాది జనవరి మొదటివారంలో బెంగాల్‌లో పర్యటించిన ఒవైసీ, హుగ్లీ జిల్లాలోని ఫుర్ఫురా షరీఫ్ దర్గాలో పిర్జాదా అబ్బాస్ సిద్దిఖీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పిర్జాదా అబ్బాస్ నాయకత్వంలో ఎంఐఎం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు. అయితే అబ్బాస్ సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితం సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి, ప్రస్తుతం కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమాన్ బసు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఇటీవల జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో అబ్బాస్ సిద్దిఖీ తమ కూటమిలో చేరబోతున్నారని ప్రకటించారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర– దక్షిణ దినజ్‌పూర్, దక్షిణ–ఉత్తర 24 పరగణాలు, హూగ్లీ, కోల్‌కతాలో ముస్లింల ఆధిపత్య స్థానాలపై ఒవైసీ, అబ్బాస్ సిద్ధిఖీ దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment