( ఫైల్ ఫోటో )
సాక్షి, గుంటూరు: చంద్రబాబుకు ఏసీ కావాలని టీడీపీ నానా యాగీ మొదలు పెట్టిందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏసీ కావాలంటున్నవారు భారతదేశంలో జైళ్లకు సంబంధించిన నిబంధనలు తెలిసి మాట్లాడాలన్నారు.
‘‘టీడీపీకి లాయర్లు కావాల్సినంతమంది ఉన్నారు. వారందరికీ జైలు మాన్యువల్ తెలుసు. జైలు మాన్యువల్ ప్రకారం రిమాండ్ ఖైదీలకు కానివ్వండీ, ఖైదీలకు కానివ్వండీ ఏసీ ఉండదని తెలుసు. ఒక వేళ ఏసీ కావాలంటే, చల్లదనం వల్ల చంద్రబాబుకు డెర్మటాలజీ సమస్యలు తగ్గుతాయనుకుంటే.. ఆ విషయాన్ని చంద్రబాబు లాయర్లు, చంద్రబాబు కుటుంబం మీడియాలో మాట్లాడి, దాన్ని రాజకీయం చేసుకుంటుందా..?, కోర్టు మెట్లు ఎక్కి కోర్టును అడుగుతుందా..?’’ అంటూ మంత్రి అంబటి ప్రశ్నించారు.
‘‘35 రోజులుగా ఏనాడూ చంద్రబాబు లాయర్లు, తమ క్లయింటుకు ఏసీ కావాలని కోర్టులో పిటిషన్ వేయలేదు. అంటే దీని అర్థం ఏమిటి?. గురు, శుక్రవారాల్లో వాదనలు సాగినప్పుడు కూడా ఈ విషయాన్ని కోర్టులో అడగలేదు. చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా?. నిర్ణయించాల్సింది న్యాయస్థానమా?. కోర్టు ఏం చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తుంది. ఖైదీలకు ఏం ఇవ్వాలో, ఏం ఇవ్వకూడదో నిర్ణయించేది కోర్టు అయినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేయడం పూర్తి దిగజారుడుతనం’’ అని మంత్రి మండిపడ్డారు.
‘‘ముందు క్వాష్ పిటిషన్ వేశారు. అది కుదరలేదు. దానిమీద హైకోర్టుకు వెళ్ళారు. కుదరలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు, కుదరలేదు. ఆ తర్వాత లూథ్రా కత్తులు, కటార్లు పట్టుకోమన్నారు. ఆ తర్వాతే ఏసీబీ కోర్టులో ఏకంగా న్యాయవాదుల మీద దాడులు చేయించారు. ఆ తర్వాత, ఇప్పుడు బాబు ప్రాణానికి ముప్పు ఉందంటూ పచ్చి అబద్ధాల వాదన, డ్రామా మొదలు పెట్టి ఇదంతా చేస్తున్నారు.’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
చదవండి: చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారు.. ఆస్పత్రి అవసరం లేదు: వైద్యుల బృందం
Comments
Please login to add a commentAdd a comment