సాక్షి, విజయనగరం: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలవి తప్పుడు ప్రచారాలంటూ కొట్టిపారేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి బొత్స ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
పచ్చనేతల పైశాచికానందం:
నాకు రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. దాదాపు అన్ని కాల్స్ నేను అటెండ్ చేస్తాను. నిన్న రాత్రి 9.30కి వచ్చిన కాల్‌ను లిఫ్ట్ చేస్తే.. తాను చంద్రబాబు అభిమానినంటూ ఒకరు నాతో మాట్లాడారు. జైల్లో బాబు అనారోగ్యం పాలయ్యారని, కాబట్టి ఆయనను ఎలాగైనా బయటకు తీసుకురావాలంటూ.. ఏడుస్తూ మాట్లాడాడు.
ఆ ప్రచారం అసత్యమని, జైల్లో బాబు ఆరోగ్యంగానే ఉన్నారని, అయినా ఆయన్ను బయటకు తీసుకురావడం తన చేతిలో లేదని చెప్పాను. ఒకవేళ బాబు నిజంగా జైల్లో అనారోగ్యం పాలైతే, వారు కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పాను. దాంతో ఆ వ్యక్తి సమాధానపడి ఫోన్ పెట్టేశాడు.. కానీ ఆ తర్వాత చూస్తే.. నా ఫోన్‌కాల్ మాటలు మీడియాలో ప్రసారం అయ్యాయి. అంటూ.. ఒక ఛానల్‌లో ప్రసారమైన తన ఫోన్ కాల్ మాటలను ఈ సందర్భంగా మంత్రి మీడియాకు చూపించారు. మరి ఆ కాల్ చేసింది ఎవరు? టీడీపీ నేతలా? లేక బాబు కుటుంబ సభ్యులా? ఎవరు చేయించినా.. నేను అటెండ్ చేసిన కాల్‌ను ఎలా రికార్డు చేశారు? ఆ హక్కు వారికెవరు ఇచ్చారు? ఇదేం పైశాచికం?.
దిగజారిన రాజకీయం:
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ఉక్కపోతతో ఒంటిపై కాస్త ర్యాష్ ఏర్పడింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ నిన్న మీడియాకు స్వయంగా చెప్పారు. అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు.. ఎల్లో మీడియా అదే పనిగా ప్రసారం చేస్తున్నట్లు.. జైల్లో ఒకవేళ నిజంగా చంద్రబాబు అనారోగ్యం పాలైతే.. ఆయనను ఆస్పత్రికి తరలించాలంటూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించవచ్చు కదా? ఆ పని చేయకుండా అదేపనిగా మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నారు?
మాపై ఎందుకు నిందలు మోపుతున్నారు? టీడీపీ ఇంత దిగజారిన రాజకీయం చేయాలా?. ఆ పార్టీ నేతలు ఇంత దౌర్భాగ్యపు పనులకు పూనుకుంటారా?. జైల్లో చంద్రబాబుకు ఏదో జరిగిపోతుందని అదే పనిగా విష ప్రచారం చేస్తూ.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఎలాగైనా సానుభూతి పొందాలన్న కుయుక్తి టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.
భిన్న వాదనలతో..
స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచుకున్న చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఈ విషయం అందరికీ తెలుసు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయంపై ప్రాధమిక సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టే, కోర్టు ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది. ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటున్న ఆయన కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నాయకులు.. అదే విషయాన్ని కోర్టులో సవాల్ చేయడం లేదు. అంటే ఒకవైపు లోపాయకారిగా చంద్రబాబు అవినీతిని వారు అంగీకరిస్తున్నారు. కానీ అదే సమయంలో ఏసీబీ కోర్టు మొదలు, హైకోర్టు.. చివరకు సుప్రీంకోర్టు వరకు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కేసు లోపలకు వెళ్లకుండా, కేవలం చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్నే తప్పు పడుతూ వాదిస్తున్నారు.
జిమ్మిక్స్‌తో లబ్ధికి డ్రామా:
ఇది ఒక పర్వం కాగా.. గత రెండు మూడ్రోజులుగా చంద్రబాబు ఆరోగ్యంపై వారు కొత్త డ్రామా మొదలు పెట్టారు. వారు చేస్తున్న నానా హంగామా.. దానిపై పచ్చ మీడియాలో మితిమీరిన రాద్ధాంతం.. అన్నీ విడ్డూరంగా ఉన్నాయి. తప్పు చేసిన వ్యక్తికి కోర్టు రిమాండ్ చేశాక.. ఆ వ్యక్తికి జైల్లో జబ్బు చేసినా, ఆ వ్యక్తి అనారోగ్యం పాలైనా.. విషయాన్ని కోర్టుకు విన్నవించాలి. మెరుగైన వైద్యం కోరాలి. అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి తగిన వైద్యం అందుతుంది. కానీ చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులు కానీ ఆ పని చేయడం లేదు. టీడీపీ నేతలు అదే పనిగా పచ్చ మీడియాలో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో సానుభూతి పొందాలని చూస్తున్నారు.
ప్రభుత్వంపై బురద చల్లుతారా?:
ఖజానాను అడ్డంగా దోచుకున్న చంద్రబాబు వంటి దొంగను సాక్ష్యాధారాలతో సహా పట్టుకుంటే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఒకవేళ చంద్రబాబు జైల్లో అనారోగ్యం పాలైతే.. అందులో ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది? టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించినంత మాత్రాన ప్రభుత్వం వెళ్లి రాజమండ్రి జైల్లో ప్రత్యేక వసతులు కల్పించలేదు కదా? ఏదైనా కోర్టు ద్వారా రావాల్సిందే కదా? ఇక్కడ ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు కదా? లేక కోర్టు ఆదేశాలు లేకపోయినా, జైలు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని అన్నీ సమకూరుస్తారని ఆశపడుతున్నారా?
రాష్ట్ర ఖజానాకు కన్నమేసి ప్రజాధనం రూ. 371 కోట్లు కొట్టేసిన దొంగగా అన్నీ సాక్ష్యాధారాలు సేకరించి చంద్రబాబును కోర్టు ముందు దోషిగా నిలబెట్టడమనేది ప్రభుత్వం చేసిన తప్పా? కేసు కోర్టు వరిధిలో ఉండగానే.. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఆయన నిర్దోషి అని టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఎలా నిర్ధారిస్తారు? అలా ఎలా మాట్లాడతారు?. వారి వాదనలను ప్రజలూ అసహ్యించుకుంటున్నారు.
ఎలా అర్థం చేసుకోవాలి?:
నేరానికి సంబంధించిన నింద పడ్డప్పుడు రైట్ రాయల్‌గా న్యాయవ్యవస్థలో పోరాటం చేసి నిజాయితీని నిరూపించుకోవడం ఒక ధీరుడి లక్షణం. చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపితే.. లోకమంతా తిరగబడ్డట్టూ.. దైవాంశ సంభూతుడ్ని కటకటాల వెనక్కి నెట్టినట్లు ఊరంతా గోల చేయడమేంటి? దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
పరామర్శల పేరుతో పండగలు:
రాజమండ్రిలో బస చేసిన అత్తా కోడళ్లు.. భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శ పేరుతో పూటకొకరు కలుస్తున్నారు. దీంతో అక్కడ పరామర్శల పేరిట పండగ చేసుకుంటున్నారు. అంటూ.. తమ పరామర్శకు వచ్చిన పార్టీ నేత అశోక్ గజపతిరాజును భువనేశ్వరి, బ్రాహ్మణి ఎంతగా నవ్వుకుంటూ పలకరిస్తున్నారో.. అప్పుడు వారు ఎంత ఉల్లాసంగా కనిపిస్తున్నారో చూడాలంటూ.. పచ్చమీడియాలో ప్రచురితమైన ఫోటోను మంత్రి చూపారు.
అదే వారి కోరిక:
చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని ఆ కుటుంబ సభ్యులకు లేదు. ఆయనను బయటకు తెచ్చే ఆలోచన కూడా వారికి లేదు. అది వారి కోర్టుల్లో వాదనల ద్వారానే అర్ధమవుతోంది. చంద్రబాబు ఇప్పటికే నెల రోజులకు పైగా జైల్లో ఉంటే.. బెయిల్ ప్రయత్నాలు చేయకుండా.. ఆయన అరెస్టులో సాంకేతిక లోపాలున్నాయంటూ.. పదే పదే అవే కారణాలు చూపుతూ.. కేసు కొట్టేయాలని కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే సీఐడీని తప్పుబడుతూ భిన్న వాదనలు వినిపిస్తున్నారు. నిజానికి, స్కిల్‌స్కామ్‌తో పాటు, ఫైబర్‌నెట్, అమరావతిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు స్కామ్‌ల్లో చంద్రబాబు పాత్ర ఉందనేది ఆయన పార్టీ నేతలు, కుటుంబ సభ్యులే నమ్ముతున్నారు. కనుకే, సాంకేతిక కారణాలంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు న్యాయవాదుల్ని పెట్టుకుని కుస్తీ పడుతున్నారు.
సీఎం రావాలి.. అదే మా కోరిక:
ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటుకు ముహూర్తం దగ్గర పడింది. అందులో భాగంగానే సీఎం జగన్ త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నారు. ఆయనతో పాటు మిగతా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమీక్షలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్ల కోసం కమిటీని నియమిస్తూ.. జీఓ జారీ చేశారు. అందుకే దొడ్డిదారి రాజధాని అంటూ పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
పరిపాలనా వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా సీఎం తీసుకున్న నిర్ణయం మూడు ప్రాంతాలకు ఆమోద యోగ్యం. ఇప్పటికే రాయలసీమకు సంబంధించి కడపలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండగా, కోస్తాలో తాడేపల్లి మాదిరిగా విశాఖలో ఒక క్యాంప్ కార్యాలయం కూడా ఉంటుంది. ఇది తప్పని పచ్చమీడియా అంటే సరిపోతుందా?
ఎవరెన్ని అడ్డుకట్ట ప్రయత్నాలు చేసినా.. సీఎం జగన్.. పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చడం ఖాయం. ఆయన ఇక్కడకు ఎంత త్వరగా మార్చితే అంత మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీడియా ద్వారా ఇదే ఆయనను కోరుతున్నామని మంత్రి సత్యనారాయణ స్పష్టం చేశారు.
చదవండి: బరువు తక్కువ డ్రామా! చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి
Comments
Please login to add a commentAdd a comment