సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడమనేది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద జోక్’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్డీఏకు ఎప్పటికీ కేసీఆర్ ప్రత్యామ్నాయం కాలేరన్నారు. దేశంలో కుటుంబపాలన తేవాలనే లక్ష్యంతో కుటుంబ పార్టీలన్నిటినీ కేసీఆర్ కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
సోమవారం కుత్బుల్లాపూర్‌లో ప్రారంభమైన ప్రజాసంగ్రామయాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవదన్నారు. తమ పార్టీ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టదని, కేసీఆర్ అవినీతికి మాత్రం తప్పకుండా మీటర్లు పెడుతుందన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు.
మజ్లిస్‌కు భయపడే..
మజ్లిస్‌కు, ఒవైసీకి బీజేపీ భయపడదని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారని, కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నా.. స్టీరింగ్, బ్రేక్ మాత్రం ఒవైసీ చేతిలోనే ఉన్నాయన్నారు. ‘8వ నిజాం కేసీఆర్. ఆయనలాంటి అరాచక వ్యక్తి, అవినీతిపరుడు ఇంకెవరూ లేరు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణను దోచుకున్నది సరిపోవట్లేదు. దేశంలోని బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ ఎలా డబ్బులు పంపిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు.
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ హామీలు ఏమయ్యాయి? సంక్షేమ హాస్టళ్లలో కలుషితాహారం తిని విద్యార్థులు మరణిస్తున్నారు. ఏం చేశాడని ఇలాంటి వ్యక్తి పాలన దేశానికి కావాలి?. తెలంగాణనే పరిపాలించే సత్తాలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తానంటే ప్రజలు నమ్ముతారా?’ అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణలో చెల్లని రూపాయని, ఇక దేశంలో చెల్లుతుందా? అని అన్నారు.
ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడమే తెలంగాణ మోడలా? అని కిషన్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. రజాకార్లను ఉరికించిన చరిత్ర తెలంగాణదని, ఖాసీంరజ్వీ పాకిస్తాన్‌కి పారిపోగా, అతడి చెంచాలను చంకలో పెట్టుకుని కేసీఆర్ తిరుగుతున్నాడన్నారు. లక్షమంది కేసీఆర్‌లు, లక్షమంది ఒవైసీలు వచ్చినా 2024లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజాసంగ్రామయాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, బండి సంజయ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment