
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపించి మాట్లాడితే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ గతంలో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి.. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?. పనికి రానీ మాటలు మాట్లాడుతున్నారు. బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే. ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీనే. వాణిజ్య ఒప్పందాల మేరకు అవకతవకలు చేశారనే దానికి నిదర్శనం ఈ ఒప్పందాలు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్‌లే. లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని బాగుచేయాలని పనిచేస్తున్నారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే ఎలా?. రుజువులతో మాట్లాడితే మంచిది.. అడ్డగోలుగా మాట్లాడ్డం మంచిది కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment