గడ్డం నాగరాజును పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పప్పు రేవంత్‌రెడ్డి, ఆల్ ఇండియా ముద్దపప్పు రాహుల్ గాంధీ దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. ఇద్దరు బిత్తిరోళ్లు ఎగేసుకుని పోయి కాళేళ్వరం ప్రాజెక్టును చూసి వచ్చి మహా ఇంజనీర్లలా బ్రిడ్జి కూలిపోతుందని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఉండే ఎక్స్‌పాన్షన్ జాయింట్ల ఫొటోలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అనడం రాహుల్, రేవంత్‌ల అవగాహనారాహిత్యానికి నిదర్శనం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి గడ్డం నాగరాజు గురువారం తన అనుచరులతో కలసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఏఐసీసీ అంటే అల్ ఇండియా చెత్తాచెదారం, టీపీసీసీ అంటే తెలంగాణ పెరట్లో చెత్తా చెదారంలా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్, నోటుకు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్లో పశువుల్లా అమ్ముతున్న రేవంత్‌ను పక్క న పెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అయిన రేవంత్‌రెడ్డి.. రాహుల్ గాందీని కూడా కోఠిలో చారాణాకో, ఆఠాణాకో అమ్మేస్తాడు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ..
‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి వరమైతే కాంగ్రెస్ పార్టీ దేశానికి శనీశ్వరం. బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలనంటూ మాట్లాడుతున్న రాహుల్ తన కుటుంబ నేపథ్యం ఏమిటో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టులోని చిన్న లోపాలను పెద్దవిగా చూపి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు జీవనదుల నడుమ ఉన్న తెలంగాణను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ కరువు కోరల్లోకి నెట్టింది.
కాంగ్రెస్ పుణ్యాన తెలంగాణలో నేల నెర్రెలు వారింది. విప్లవ ఉద్యమాల నెత్తురుతో ఎర్రవారింది. రాహుల్ గాం«దీకి తెలంగాణ చరిత్ర తెలియదు. తెలుసుకొనే సోయి, పరిజ్ఞానం కూడా లేదు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం జరగలేదు. కాంగ్రెస్ పాలన సక్రమంగా జరిగి ఉంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎందుకు ఉద్యమించారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఢిల్లీ నుంచి వచ్చి దాడి చేస్తే ఊరుకోం..
‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరి సాగులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. ప్రాజెక్టు ఫెయిలైతే 3.50 కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండింది? కాళేశ్వరం గురించి ఆయన పక్కన ఉన్న సన్నాసులు చెప్పేది కాకుండా రాహుల్ అసలు విషయాలు తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? కుంభకోణా ల కుంభమేళా కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయతీ గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు.
ఇది ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నడుమ జరుగుతున్న ఎన్నిక. మోదీ విధానాలు జుమ్లా లేదా హమ్లా. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణపై దాడి చేస్తే సహించేది లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దరువు ఎల్లన్న, సిద్దం వేణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment