శనివారం చేవెళ్ల చౌరస్తాలో ఏర్పాటుచేసిన సభకు హాజరైన జనం. ఇన్‌సెట్‌లో రేవంత్‌రెడ్డి
(చేవెళ్ల నుంచి సాక్షి ప్రతినిధి): ’స్విస్ బ్యాంకులో అక్రమంగా దాచుకున్న ధనాన్ని తెచ్చి ప్రతివ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి, 10 పైసలు కూడా వేయలేదు. ప్రతియేటా 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామన్నారు. అదే జరిగితే 50 లక్షలమంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి. రైతు ఆదాయం రెండింతలుకాదు కదా పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకుండా పోయింది. అన్ని నిత్యావసరాల ధరలను పెంచి కేంద్ర, రాష్ట్ర పాలకులు సామాన్యులను కాల్చుకు తింటున్నారు’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వివరించారు.
ఏఐసీసీ పిలుపులో భాగంగా ’నిత్యావసరాల ధరల పెరుగుదలపై నిరసన యాత్ర ’పేరుతో శనివారం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ దిగ్విజయ్‌సింగ్‌తో కలసి రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి చేవెళ్ల ఇందిరాగాంధీ విగ్రహం వరకు 10 కిలోమీటర్ల పాదయాత్రలో రేవంత్ పాల్గొన్నారు.
అనంతరం చేవెళ్ల చౌరస్తాలో ఏర్పాటు చేసినసభలో ఆయన మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ గద్దెనెక్కిన ఎనిమిదేళ్లలో రూ.60 ఉన్న పెట్రోల్ లీటర్‌కు రూ.110 అయిందని, రూ.450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి అయిందని, ఒక్క పెట్రోల్ ధర రూపంలోనే మోదీ, కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో రూ.32 లక్షల కోట్లను దోచుకున్నారని విమర్శించారు.
చేవెళ్ల గడ్డ.. కాంగ్రెస్‌కు అచ్చొచ్చిన అడ్డా..!
చేవెళ్ల గడ్డ కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చిన అడ్డా అని, నాడు వైఎస్ ఇక్కడి నుంచే పాదయాత్ర చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారని రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తెచ్చేందుకే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పక్షాన నిలబడిందని చెప్పారు. చేవెళ్ల సభలో ఏ పార్టీ కౌకుంట్ల ఎంపీటీసీ కావలి సుజాతతోపాటు పలువురు రేవంత్, దిగ్విజయ్‌సింగ్‌ల సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరారు.
‘ఇక కాంగ్రెస్ నుంచి పోయేవారు లేరు. వచ్చేవారే రెడీగా ఉన్నారు. టీఆర్‌ఎస్ చెరువు తెగింది. టీఆర్‌ఎస్ వాళ్ల బతుకు చేవెళ్ల బస్టాండ్ అయింది’అని రేవంత్ వ్యాఖ్యానించారు. సభకు ముందు చేవెళ్ల చౌరస్తాలోని వైఎస్సార్, ఇందిరాగాంధీ, కె.వి.రంగారెడ్డిల విగ్రహాలకు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పేదల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీనే
పెద్దఎత్తున పెరిగిన ధరలతో పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్, పప్పు, నూనె, యూరియా, డీఏపీ ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక ఉపాధి సంస్థలను అమ్మేస్తోందని ఆరోపించారు. దేశంలో పేదల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment